: ‘సివిల్స్’ తెలుగు తేజాలు ఏమంటున్నారంటే...!


సివిల్స్ సర్వీసెస్ -2015 ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 70 మంది వరకు ఎంపికైన విషయం తెలిసిందే. అందులో సగం మంది గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినవారే. ర్యాంకులు సాధించిన తెలుగు తేజాలు తమ అభిప్రాయాలను ఒక టీవీ ఛానెల్ తో పంచుకున్నారు. సివిల్స్ ఎంట్రన్స్ కు తాము ఎంత కష్టపడింది, ఎన్ని ప్రయత్నాల్లో తమ లక్ష్యాన్ని సాధించింది, వారికి స్ఫూర్తి నిచ్చిన అంశాలు... ఇలా మొదలైన విషయాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఒక ఐఏఎస్ అధికారి స్పీచ్ స్ఫూర్తి నిచ్చింది: కీర్తి చేకూరి, 14వ ర్యాంకర్ నాకు చిన్నప్పటి నుంచి ఐఏఎస్ కావాలనే కల లేదు. నేను ఐఐటీ లో బీటెక్, మెటలర్జీ చేశాను. అక్కడ నాకు అర్థమైందేమిటంటే, నాలుగు గోడల మధ్యన కూర్చుని మిషన్లతో రీసెర్చ్ చేయడం నాకు సరైంది కాదని తెలుసుకున్నాను. ఛాలెంజింగ్ జాబ్ కావాలనిపించింది. అదేసమయంలో మా కాలేజీకి ఒక ఐఏఎస్ అధికారి రావడం, ఐఏఎస్ గురించి గొప్పగా చెప్పడంతో స్ఫూర్తి పొందాను. మొదటి ప్రయత్నంలో ఐఆర్ఎస్ వచ్చింది. అయితే, ఐఏఎస్ సాధించాలనేది నా లక్ష్యం. మూడో ప్రయత్నంలో సాధించాను. నేను చేస్తున్న జాబ్ నచ్చలేదు..అందుకే దీనికి ట్రై చేశాను: సీహెచ్ రామకృష్ణ, 84వ ర్యాంకర్ పరీక్షలు రాయడమంటే నాకు సరదా. ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేశాను. కొంచెం డిఫరెంట్ గా ట్రై చేద్దామనిపించింది. సివిల్స్ రాద్దామనుకున్నాను. మొదటి ప్రయత్నంలో ర్యాంకు రాలేదు. రెండో ప్రయత్నంలోను రాలేదు. మూడో ప్రయత్నం చేశాను.. ర్యాంకు రాలేదు. మళ్లీ నాలుగో ప్రయత్నం చేశాను ఐఆర్ఎస్ వచ్చింది. ఐదో ప్రయత్నంలో 84వ ర్యాంకు సాధించాను. నేను చేస్తున్న జాబ్ నచ్చలేదు, కొత్తగా ఉండాలి, ఫ్యాన్సీగా ఉంటుంది, చెప్పుకోవడానికి బాగుంటుందని చెప్పి దీనికి ట్రై చేశాను సాధించాను. నా లక్ష్యానికి కారణం మా అమ్మే: విద్యాసాగర్ నాయుడు, 101వ ర్యాంకర్ చిన్నప్పటి నుంచి నాకు ఐఏఎస్ లేదా ఐపీఎస్ అంటే ఇష్టం. దానికి కారణం మా అమ్మే. ఈ విషయాలను ఆమె అప్పుడే నాకు చెప్పేది. నీకు ఇష్టమైందే చెయ్యమని చెప్పి నా తల్లిదండ్రులు చెబుతుండేవారు. దానినే నేను అనుసరించాను... విజయం సాధించాను. హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ అండ్ లక్ ఉండాలి : జొన్నలగడ్డ స్నేహజ, 103వ ర్యాంకు నేను సీఏ పూర్తి చేశాను. అది ఫిక్స్ డ్ సిలబస్ ఉంటుంది కనుక నాకు ఈజీగానే అనిపించింది. నాలుగో ప్రయత్నంలో నేను సివిల్స్ లో ర్యాంకు సాధించాను. ర్యాంకు సాధించడం అంత తేలికేమీ కాదు. హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ అండ్ లక్ ఉండాలి. సివిల్స్ రాసేవాళ్లకు నేను చెప్పదలచుకున్నది ఒక్కటే... స్ట్రాంగ్ బ్యాకప్ ఉండాలి లేకపోతే కష్టం. నేను సీఎ కావడానికి మా నాన్నే స్ఫూర్తి. సివిల్స్ చేస్తానంటే పూర్తిగా సహకరిస్తామని మా నాన్న చెప్పారు. సివిల్స్ రాయమని ఫోర్స్ మాత్రం చేయలేదు. మా తల్లిదండ్రుల స్ఫూర్తితోనే సివిల్స్ రాశాను: డాక్టర్ అలా ప్రియాంక, 529వ ర్యాంకర్ మా నాన్న డాక్టరు. అమ్మ కూడా గవర్నమెంట్ ఎంప్లాయి. చిన్నప్పటి నుంచి నాకు చాలా విషయాలు చెబుతుండేవారు. ఆ స్ఫూర్తి తో నేను మెడిసిన్ లో సీటు సంపాదించాను. మెడిసిన్ థర్డ్, ఫోర్త్ ఇయర్ లో ఉండగా నాకు సివిల్స్ రాయాలనే ఆలోచన వచ్చింది. మా చెల్లెలు ఐఐటీలో చదువుకుంది. సివిల్స్ లో సీటు కొట్టాలన్నది ఆమె గోల్. దీంతో, ఇద్దరం కలిసి స్టడీ చేశాము. 2013లో నా చెల్లెలు సివిల్స్ లో ర్యాంకు సాధించింది. నా మూడో ప్రయత్నంలో సివిల్స్ లో ర్యాంకు సాధించాను.

  • Loading...

More Telugu News