: ప్రభుత్వ దోపిడీని మాత్రమే వ్యతిరేకిస్తున్నాం.. తెలంగాణ ప్రాజెక్టులను కాదు: ఉత్తమ్ కుమార్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోన్న ప్రాజెక్టులపై కాంగ్రెస్ పార్టీ అనవసర రాద్ధాంతం చేస్తోందంటూ టీఆర్ఎస్ నేతలు విమర్శిస్తోన్న నేపథ్యంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. తెలంగాణ ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వం చేస్తోన్న దోపిడీని మాత్రమే తాము వ్యతిరేకిస్తున్నామని ఆయన అన్నారు. ప్రజా సంక్షేమానికి ఉపయోగపడే ప్రాజెక్టులని తాము ఎప్పటికీ వ్యతిరేకించబోమని తెలిపారు. ఆర్డీఎస్‌పై అధికార టీఆర్ఎస్ నిర్లక్ష్యం వహిస్తోందని, ఇప్పటివరకు దానికోసం ఒక్క పైసా కూడా విడుదల చేయలేదని ఉత్తమ్ పేర్కొన్నారు. ఆర్డీఎస్ పై తాము కర్ణాటక ముఖ్యమంత్రితో మాట్లాడామని, ఆర్డీఎస్ పనులు పూర్తి చేస్తామంటూ సిద్ధరామయ్య హామీ కూడా ఇచ్చారని ఉత్తమ్‌కుమార్ తెలిపారు. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తోందని, రాష్ట్ర ప్రయోజనాలను మహారాష్ట్రకు తాకట్టు పెడుతోందని విమర్శించారు.