: కొబ్బరిబోండాల నుంచి ఐస్ క్రీం, ఫ్రూట్ జ్యూస్ ల చలివేంద్రాలు... మంత్రితో అట్టహాసంగా ఓపెనింగ్... ఫోటోల తరువాత చీటింగ్!
ఈ వేసవిలో ఎండలు మండుతుండడంతో, నెల్లూరు ప్రాంతంలో ప్రచారార్భాటానికి, గొప్పలకు పోయి, వివిధ రకాల చలివేంద్రాలు పెట్టి ఆపై, వాటిని మూసేయడం మినహా మరో దారి లేని ప్రజాప్రతినిధుల ప్రహసనానికి సంబంధించిన కథనం ఇది. ఎండల్లో ప్రయాణించేవారికి కాస్తంత ఉపశమనంగా ఉండేలా వివిధ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటవుతాయన్న సంగతి తెలిసిందే. మామూలుగా చలివేంద్రం అనే బదులు తాటిముంజల చలివేంద్రం అంటూ, నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ధర్మవరం సుబ్బారావు, ఆయన భార్య సుజాతరావులు ఓ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ముంజలు పంపిణీ చేస్తుండటంతో, విపరీతమైన ప్రచారం వచ్చి అక్కడ జనాల క్యూ చాంతాడంత పెరిగిపోయింది. దీన్ని చూసిన మరో కార్పొరేటర్ నూనె మల్లికార్జున యాదవ్, తన వార్డులో తాటి ముంజలతో పాటు కొబ్బరిబోండాలు, మజ్జిగ అంటూ చలివేంద్రాన్ని మొదలుపెట్టారు. పైగా దీన్ని మంత్రి నారాయణతో అట్టహాసంగా ప్రారంభింపజేశారు కూడా. ఇంకేముంది, జనాల క్యూ ఇక్కడకు మారిపోయింది. ప్రజలకు దగ్గరయ్యేందుకు ఇదే సరైన మార్గం అనుకున్నారో ఏమో, అదే ఊపుతో మల్లికార్జున యాదవ్ మరో చోట ఫ్రూట్ జ్యూస్, ఐస్ క్రీంలను కూడా కలిపి మరో చలివేంద్రాన్ని ఇంకో మంత్రి శిద్ధా రాఘవరావును పిలిచి ఆర్భాటంగా ప్రారంభించారు. ఈ చలివేంద్రానికి మీడియాలో సైతం మంచి ప్రచారమే లభించిందండోయ్! విషయం తెలుసుకున్న నెల్లూరు నగర ప్రజలు తండోపతండాలుగా ఈ చలివేంద్రాన్ని వెతుక్కుంటూ మరీ వచ్చారు. తీరా అక్కడికి వచ్చి చూసిన తరువాత, కొబ్బరిబోండాలు, మజ్జిగ, ఐస్ క్రీం కాదుగదా... కనీసం మంచి నీళ్లు కూడా లేవట. దీంతో ఈ తతంగమంతా ప్రచారం కోసం జరిగిన నాటకమని తిట్ల దండకాన్ని ప్రారంభించారు. ఇక "నెల్లూరు వంటి ప్రాంతాల్లో తాటిముంజలు, కొబ్బరిబోండాలు ఉచితంగా ఇస్తే, కొండలైనా కరిగిపోవూ? కార్పొరేటర్లు బిల్డప్ ఇస్తే, మంత్రులెరా నమ్మారు చెప్మా?" అంటూ జనాలు జోకులేసుకుంటున్నారు.