: సంచలనం... పనామా పేపర్స్ లో 'హెరిటేజ్' ఫుడ్స్ డైరెక్టర్ మోటపర్తి శివరామ వరప్రసాద్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుటుంబ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ లో డైరెక్టర్ హోదాలో ఉన్న మోటపర్తి శివరామ వరప్రసాద్ విదేశాల్లో నల్లధనాన్ని దాచుకున్నారని పనామా పేపర్స్ లో వెల్లడైంది. బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్ తో పాటు పనామా, ఈక్వెడార్ లలోని మూడు కంపెనీల ద్వారా ఆయన దేశంలోని డబ్బును అక్రమంగా తరలించి, ఇండియాలో చెల్లించాల్సిన పన్నులు ఎగ్గొట్టారని ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక పూర్తి వివరాలతో కూడిన కథనాన్ని ప్రచురించి సంచలనం కలిగించింది. ఎంపీ హోల్డింగ్స్ అసోసియేట్స్, బాలీవార్డ్ లిమిటెడ్, బిట్ కెమీ వెంచర్స్ లిమిటెడ్ అనే పేర్లతో ఉన్న కంపెనీలకు సంబంధించిన దస్త్రాల్లో ఆయన పేరు ఉన్నట్టు తెలిపింది. ఈ లావాదేవీలపై పూర్తి విచారణ జరిపితే, ఆయన ఎవరి బినామీనో తెలిసిపోతుందని చంద్రబాబు పేరును ప్రస్తావించకుండానే సదరు దినపత్రిక తన అభిప్రాయాన్ని చెప్పింది. ఈ కథనాన్ని చూసిన తెలుగుదేశం పార్టీ నేతల్లో, తమ నేతను విమర్శించేందుకు మరో అస్త్రం విపక్షాలకు లభించినట్లైందని ఆందోళన కలుగుతున్నట్టు తెలుస్తోంది. కాగా, వరప్రసాద్ కుమారుడు, రెండేళ్ల క్రితం హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్ గా విధులు స్వీకరించిన సునీల్ బిట్ కెమీ వెంచర్స్ అనే సంస్థలో పెట్టుబడులు పెట్టినట్టు పనామా పేపర్స్ లో వివరాలున్నాయి.