: ప్రధాని డిగ్రీ కరెక్టే, సంవత్సరమే తప్పు: విపక్షాలకు మరో అస్త్రాన్నిచ్చిన ఢిల్లీ రిజిస్ట్రార్


రెండు రోజుల క్రితం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీలు మీడియాకు చూపించిన ప్రధాని మోడీ డిగ్రీ సర్టిఫికెట్ వాస్తవమేనని, అయితే, సంవత్సరం మాత్రం పొరపాటున తప్పు పడిందని ఢిల్లీ రిజిస్ట్రార్ తరుణ్ దాస్ వెల్లడించారు. తాము రికార్డులన్నీ పరిశీలించామని, ఆయన 1978లో పరీక్షలు పాస్ కాగా, 1979లో డిగ్రీ వచ్చినట్టు తప్పు పడిందని తెలిపారు. ఆయన సీసీ 594/74 నెంబరుతో ఎన్ రోల్ అయ్యారని, ఆయన హాల్ టికెట్ సంఖ్య 16594 అని దాస్ వివరించారు. కాగా, తరుణ్ దాస్ ప్రకటనతో విపక్షాలకు మోదీ విద్యార్హతలపై విమర్శించేందుకు మరో అస్త్రం దొరికినట్లయింది. 1978లో పరీక్షలు రాసి పాస్ అయితే, 1979లో ఉత్తీర్ణుడైనట్టు సర్టిఫికెట్ ఇస్తే, అప్పుడే దాన్ని ఎందుకు సరిచేసుకోలేదన్నది మొదటి ప్రశ్న. అప్పట్లో పరీక్షలు రాసి పాసైన మిగతా విద్యార్థుల సర్టిఫికెట్లలోనూ ఇదే తప్పు దొర్లిందా? లేక మోదీ సర్టిఫికెట్లో మాత్రమేనా? ఇది కాకతాళీయంగా జరిగిందా? లేక ఆప్ ఆరోపిస్తున్నట్టు తప్పుడు ధ్రువపత్రమా? తమ అధినేత ఏ సంవత్సరం డిగ్రీ చదివారో కూడా తెలుసుకోకుండానే, ఉన్నత పదవుల్లో ఉన్న అమిత్, జైట్లీలు మీడియా ముందుకు వచ్చి తప్పు సంవత్సరంతో ఉన్న సర్టిఫికెట్ ను చూపించారా? ఈ విషయంలో మోదీ స్వయంగా నోరు విప్పితేనే నిజం తెలుస్తుంది. అన్నింటికీ మించి, ఆప్ నేతలు ఢిల్లీ వర్శిటీకి వెళ్లి తాము రికార్డులను పరిశీలిస్తామని చెప్పిన తరువాత, ఢిల్లీ రిజిస్ట్రార్ ప్రకటన రావడం వెనుక ఆంతర్యం ఏమిటో?

  • Loading...

More Telugu News