: మంత్రి నారాయణ కోసం రోడ్డుపై వెయిట్ చేసిన వైసీపీ ఎమ్మెల్యే!... తెలుగు పత్రిక ఆసక్తికర కథనం!
నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వైసీపీకి హ్యాండిచ్చి టీడీపీలో చేరేందుకు దాదాపుగా రంగం సిద్ధమైందన్న ప్రచారం ఊపందుకుంది. ఈ వార్తను రామిరెడ్డి నేటి ఉదయం కొట్టిపారేసినా... ఇటీవల ఆయన టీడీపీ నేతలతో పలుమార్లు భేటీ అయిన వైనానికి సంబంధించి ఓ ప్రముఖ తెలుగు దినపత్రిక నేటి తన సంచికలో ఓ ఆసక్తికర కథనం రాసింది. ఈ కథనం ప్రకారం... టీడీపీలో చేరేందుకు దాదాపుగా నిర్ణయం తీసుకున్న రామిరెడ్డి ఈ నెల 6న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడితో భేటీ అయ్యారు. ఆయనను టీడీపీలోకి చేర్చుకునేందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక పూర్తి స్థాయి చర్చలు మంత్రి నారాయణతో జరపాలని రామిరెడ్డికి చంద్రబాబు సూచించారు. అదే సమయంలో రామిరెడ్డితో మాట్లాడి ఆయనను పార్టీలో చేర్చుకునే మిగతా అన్ని విషయాలను పర్యవేక్షించాలని కూడా మంత్రి నారాయణను చంద్రబాబు ఆదేశించారు. ఈ క్రమంలో ఈ నెల 8న రాత్రి నెల్లూరు నుంచి మంత్రి నారాయణ విజయవాడకు బయలుదేరారు. నారాయణ నుంచి సమాచారం అందుకున్న రామిరెడ్డి కావలిలో తన ముఖ్య అనుచరుడు సుకుమార్ రెడ్డితో కలిసి రోడ్డుపై వెయిట్ చేశారు. తన కాన్వాయ్ ని రామిరెడ్డి వద్ద ఆపేసిన మంత్రి నారాయణ తన కారు దిగి రామిరెడ్డి కారు ఎక్కారు. అక్కడి నుంచి వారిద్దరూ ఓ రహస్య ప్రదేశానికి వెళ్లి దాదాపు మూడు గంటల పాటు చర్చలు జరిపారు. ఈ చర్చలు ఫలించిన నేపథ్యంలోనే రామిరెడ్డి సైకిల్ ఎక్కేందుకు అంగీకరించారు.