: ‘ఎర్ర’ స్మగ్లింగ్ లో మహిళా డాన్!... కోల్ కతాలో అరెస్ట్ చేసిన చిత్తూరు పోలీసులు
తిరుమల వెంకన్న కొలువై ఉన్న శేషాచలం అడవుల్లోని విలువైన ఎర్రచందనం అక్రమ తరలింపులో పురుషులతో పాటు మహిళలు కూడా చురుగ్గా పాల్గొంటున్న ఘటనలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే చిత్తూరు కేంద్రంగా ఓ మహిళా స్మగ్లర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు... తాజాగా ‘ఎర్ర’ స్మగ్లింగ్ లో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన సంగీతా చటర్జీని కూడా అరెస్ట్ చేశారు. భర్త లక్ష్మణ్ తో కలిసి ఎర్ర దుంగలను దేశం సరిహద్దులు దాటించే పనిలో సంగీతా చటర్జీ చక్రం తిప్పారు. భర్త అరెస్ట్ అయినా, ఆమె మాత్రం తన పనిని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె పూర్తి వివరాలు సేకరించిన చిత్తూరు జిల్లా పోలీసులు పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాకు వెళ్లి రెండు రోజుల క్రితమే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. వారంలోగా ఆమెను చిత్తూరు తీసుకురానున్నట్లు సమాచారం. చిత్తూరు జిల్లా పరిధిలో సంగీతాపై నాలుగు కేసులు నమోదయ్యాయి.