: ఫిక్సింగ్ పై ప్రశ్నిస్తే... ఆన్సరివ్వకుండా విసవిసా వెళ్లిపోయిన అజారుద్దీన్!
టీమిండియా సారథుల్లో విజయవంతమైన కెప్టెన్లలో హైదరాబాదీ క్రికెటర్ మొహ్మద్ అజారుద్దీన్ కూడా ఒకరు. అయితే ఫిక్సింగ్ వివాదంలో చిక్కుకున్న ఆయన విజయసారథిగా ప్రతిష్ఠతో పాటు ఫిక్సర్ గా అప్రతిష్ఠనూ మూటగట్టుకున్నారు. ఏళ్ల క్రితం చోటుచేసుకున్న ఈ ఫిక్సింగ్ కుంభకోణం ఇప్పటికీ ఆయనను వెంటాడుతూనే ఉంది. అసలు ఈ ప్రస్తావన అంతా ఎందుకంటే... అజారుద్ధీన్ జీవిత చరిత్రపై బాలీవుడ్ లో ‘అజర్’ పేరిట ఓ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం ప్రమోషన్ లో నటీనటులతో పాటు అజార్ కూడా పాలుపంచుకుంటున్నారు. ఈ క్రమంలో నిన్న ఢిల్లీలో జరిగిన ప్రమోషన్ లో అజార్ కు చేదు అనుభవం ఎదురైంది. ఫిక్సింగ్ వివాదాన్ని ప్రస్తావించిన ఓ మీడియా ప్రతినిధి... ఆ కుంభకోణంలో మీరు డబ్బు తీసుకున్నారా? లేదా? అంటూ సూటిగా ప్రశ్నించారు. దీంతో షాక్ తిన్న అజార్... ప్రశ్నకు సమాధానమివ్వకుండా ఎర్రబడ్డ ముఖంతో విసవిసా అక్కడి నుంచి లేచి వెళ్లిపోయారు. ఆ తర్వాత వేదిక మీదకు రావాలని చిత్ర యూనిట్ పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఆయన ససేమిరా అన్నారు.