: సీఎం కావాలనే ఆశ నాకు లేదు... కేసీఆర్ మరో పదిహేనేళ్లు సీఎంగా వుండాలి!: మంత్రి కేటీఆర్
ముఖ్యమంత్రి కావాలనే ఆశ తనకు లేదని, కాకపోతే, కేసీఆర్ మాత్రం మరో పదిహేనేళ్లు సీఎంగా ఉండాలని మాత్రం తాను కోరుకుంటున్నానని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్ బలపడే క్రమంలో చాలా మంది ఈ పార్టీలో చేరుతున్నారని, ఈ విషయం కొంతమందికి రుచించొచ్చు, మరికొంతమందికి రుచించకపోవచ్చని అన్నారు. కేసీఆర్ పై గతంలో అవాకులు చవాకులు పేలిన నాయకులు ఈరోజు ఆయన బాటలోకి వచ్చారని, అది కేసీఆర్ విజయమని అన్నారు. తాత్కాలిక అవసరాల నిమిత్తం టీఆర్ఎస్ లోకి వేరే పార్టీ నేతలు చేరుతున్నారా? అనే ప్రశ్నకు కేటీఆర్ సమాధానమిస్తూ, ‘జీవితమే తాత్కాలికం, ఏదీ పర్మినెంట్ అనేది లేదు’ అని అన్నారు. తనపై బాధ్యతలు పెరుగుతున్నాయనేది పెద్ద విషయం కాదని అన్నారు. శాఖల మార్పిడి అనేది కూడా ముఖ్యమంత్రి విచక్షణాధికారమని, ఆ నేపథ్యంలోనే తనకు గనుల శాఖ వచ్చిందని అన్నారు. మైనింగ్ కు, రాజకీయాలకు, ప్రభుత్వ నిర్వహణకు ఏమి సంబంధముందని కేటీఆర్ ప్రశ్నించారు. మైనింగ్ లో అక్రమార్కుల ఆటకట్టించాలని, ఇటువంటి అక్రమాలకు ఒకవేళ తమ పార్టీ నేతలు పాల్పడ్డా వదలిపెట్టే ప్రసక్తి లేదని కేటీఆర్ పేర్కొన్నారు.