: గోమాతాకీ జై ... డబ్బు జేబులోకి తోసేయ్!: హర్యానాలో నకిలీ 'గో సంరక్షకులు'
హర్యానా రాష్ట్రంలో ఆవులను సంరక్షించే నిమిత్తం అక్కడి బీజేపీ సర్కార్ గోవధ నిషేధ చట్టం తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. సోమరిపోతులు, గూండాలు ఈ చట్టాన్ని ఆసరా చేసుకుని కాలు కదపకుండా, ఒళ్లు వంచకుండా డబ్బు సులువుగా సంపాదించుకుంటున్నారు. హర్యానాలోని బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, దాబాలు మొదలైన చోట్ల ‘గో సంరక్షణ నిధి’ పేరిట విరాళాల డబ్బాలను వారు పెడుతున్నారు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఒక్కొక్క దాబాలో కనీసం అరడజను విరాళాల డబ్బాలు దర్శనమిస్తున్నాయి. ఇక, విరాళాల నిమిత్తం వాటి ద్వారా నెలకు లక్షల రూపాయలు వస్తున్నాయి. ఈ డబ్బును తీసుకుని హాయ్ గా వారు ఎంజాయ్ చేస్తున్నారు. కాగా, ఈ విషయమై దాబాల యజమానులు మాట్లాడుతూ, విరాళాల సొమ్ము గో సంరక్షణ శాలలకు వెళ్లడం లేదని అన్నారు. ఈ విషయాన్ని స్వయంగా గో సంరక్షణ శాలల నిర్వాహకులే తమకు చెప్పారంటూ దాబా యజమానులు పేర్కొన్నారు. విరాళాల విషయమై ఒక గోశాల మేనేజర్ మాట్లాడుతూ, మోసపూరిత వ్యక్తులు విరాళాల బాక్సులు పెడుతుండటంతో తమకు నష్టం జరుగుతోందన్నారు. గోశాలకు వచ్చే విరాళాల సంఖ్య బాగా తగ్గిపోయిందని వాపోయారు. తాము ఖర్చు పెట్టే ప్రతి పైసాకు లెక్క ఉంటుందని సదరు మేనేజర్ చెప్పారు.