: సండ్ర వెంకట వీరయ్య కూడా టీఆర్ఎస్ లోకి... మిగిలేదిక రేవంత్ ఒక్కరే!
ప్రస్తుతం ఉప ఎన్నిక జరుగుతున్న పాలేరు మాజీ ఎమ్మెల్యే, సత్తుపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన సండ్ర వెంకట వీరయ్య కూడా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరనున్నారా? పాలేరు ఉపఎన్నికల నేపథ్యంలో ఆయన ఫిరాయింపు దాదాపు ఖరారైపోయినట్టేనని, దీనిపై టీఆర్ఎస్ నేతలు సండ్రతో సంప్రదింపులు జరుపుతున్నాయని ఓ తెలుగు దినపత్రికలో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. ఇక టీఆర్ఎస్ లో మీరు చేరుతారా? అని సండ్రను అడిగితే, ఆయన 'చేరేది లేదు' అని స్పష్టంగా చెప్పలేదన్నది ఆ కథనం సారాంశం. ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని మాత్రం చెప్పి అప్పటికి తప్పించుకున్నారట. ఓటుకు నోటు కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఇక సండ్ర కూడా టీఆర్ఎస్ లో చేరితే, తెలుగుదేశం పార్టీకి మిగిలేది రేవంత్ ఒక్కరే. ఎందుకంటే టీడీపీ తరఫున గెలిచినప్పటికీ, ఆర్.కృష్ణయ్య క్రియాశీలకంగా లేరు కాబట్టి.