: 'అంతర్జాతీయ సంబంధాలు'లో అప్పట్లో మోదీ తెలివితేటలు అంతంతమాత్రమే... ఎంఏలో ఆయనకు వచ్చిన మార్కులివే!
గడచిన రెండేళ్లలో ఎన్నో విదేశీ పర్యటనలు జరిపి, భారత్ కు వివిధ దేశాలతో ఉన్న ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేసిన ప్రధాని నరేంద్ర మోదీ 'ఇంటర్నేషనల్ రిలేషన్స్' విషయంలో ఏమంత చురుకుగా ఉండేవారు కారట. ఆయన విద్యార్హతలు వెల్లడైన నేపథ్యంలో ఎంఏ పార్ట్-1, పార్ట్-2 మార్కులు సైతం బయటకు వచ్చాయి. పొలిటికల్ అనాలిసిస్ పేపర్ లో రాణించిన ఆయన, ఇంటర్నేషనల్ రిలేషన్స్ పేపర్ లో అత్తెసరుగా 48 మార్కులు మాత్రమే తెచ్చుకున్నారని సమాచారం. జూలై, 1981లో ఎంఏ పార్ట్-1 రాసిన ఆయన 400 మార్కులకు గాను 237 మార్కులు తెచ్చుకున్నారని, ఇండియన్ పాలిటిక్స్ పేపర్ లో 61, ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో 48, రీసెంట్ పొలిటికల్ థాట్స్ లో 60, కంపారెటివ్ పాలిటిక్స్ లో 68 మార్కులతో ఉత్తీర్ణులయ్యారని తెలుస్తోంది. ఇక ఎంఏ పార్ట్ -2లో భాగంగా ఏప్రిల్, 1982లో పరీక్షలు రాశారని, అందులో 400 మార్కులకు గాను 262 మార్కులు తెచ్చుకున్నారట. యూరోపియన్ అండ్ సోషల్ పొలిటికల్ థాట్స్ పేటర్లో 64, మోడరన్ ఇండియా విభాగంలో 62, పొలిటికల్ అనాలిసిస్ లో 69, కాన్సెప్ట్ టూల్స్ / పొలిటికల్, సైకలాజికల్, సోషల్ పేపర్ లో 67 మార్కులు తెచ్చుకున్నారని, మొత్తం ఎంఏలో 800 మార్కులకు గాను 499 మార్కులు వచ్చాయని 'మిర్రర్' పత్రిక, వర్శిటీ రికార్డు ప్రతులను చూపుతూ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.