: ఉత్తరాఖండ్ లో అరుదైన ఘటన!... 2 గంటల పాటు రాష్ట్రపతి పాలన ఎత్తివేత!
రాజకీయ సంక్షోభం నెలకొన్న ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలనను ఎత్తివేశారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం కేంద్రం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఎత్తివేత ఉత్వర్వులు కేవలం రెండు గంటల వ్యవధి మాత్రమే అమల్లో ఉంటాయి. దేశ రాజకీయ చరిత్రలోనే అరుదైన ఘటనగా రాజ్యంగ నిపుణులు పేర్కొంటున్న ఈ వ్యవహారంలో కేవలం రెండు గంటల సేపు మాత్రమే రాష్ట్రపతి పాలనను ఎత్తివేశారు. సంపూర్ణ మెజారిటీలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సీఎం హరీశ్ రావత్ కు 9 మంది సొంత పార్టీ ఎమ్మెల్యేలు హ్యాండివ్వగా ఆయన ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. పలు నాటకీయ పరిణామాల్లో భాగంగా ఉత్తరాఖండ్ అసెంబ్లీని సుప్త చేతనావస్థలో పెట్టిన కేంద్రం... ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సిఫారసు చేసింది. కేంద్ర ప్రతిపాదనకు రాష్ట్రపతి కూడా ఆమోద ముద్ర వేయడంతో ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చేసింది. అయితే ఉత్తరాఖండ్ హైకోర్టు, సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులు పార్టీ ఫిరాయింపులపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకునేందుకు రావత్ కు అవకాశం చిక్కింది. ఈ నేపథ్యంలో బల పరీక్ష నిర్వహించాలంటే అసెంబ్లీని సుప్త చేతనావస్థలో నుంచి తప్పించాలి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు దిశానిర్దేశంతో ఆ రాష్ట్రంలో బల పరీక్ష జరిగే సమయంలో రాష్ట్రపతి పాలనను ఎత్తివేసేందుకు కేంద్రం అంగీకరించక తప్పలేదు. కొద్దిసేపటి క్రితం రావత్ అసెంబ్లీకి చేరుకోగా, రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. బల పరీక్షలో రావత్ నెగ్గితే... రాష్ట్రపతి పాలన పూర్తిగా తొలగిపోనుంది. ఒకవేళ రావత్ విశ్వాస పరీక్షలో ఓడితే మాత్రం మరో రెండు గంటల తర్వాత ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన అమల్లోకి వస్తుంది.