: రాజధానిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం, పట్టిసీమలో కమిషన్లు... ఇంకేం చేస్తున్నారు? బాబుపై వైకాపా మండిపాటు


అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్న చంద్రబాబునాయుడు, తన స్వార్థం కోసం ప్రత్యేక హోదా అంశాన్ని తాకట్టు పెట్టారని వైకాపా మండిపడింది. ఈ ఉదయం కాకినాడలో వైకాపా తలపెట్టిన ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం, పట్టిసీమలో కమిషన్లకు కక్కుర్తి పడటం మినహా చంద్రబాబు సర్కారు మరేమీ చేయడం లేదని ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో పోరాడాలని సలహా ఇస్తున్నారని, అసలు హోదా కోసం పోరాడాల్సింది ఎవరని ప్రశ్నించారు. కేంద్రంలో మంత్రి పదవులు, కేసుల భయంతో రాష్ట్రాన్ని గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. చంద్రబాబు రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని ప్రజలకు చెప్పేందుకే నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని, హోదా వచ్చేంతవరకూ పోరాడాలని తమ నేత జగన్ నిర్ణయించారని తెలిపారు. హోదా లేకపోవడం వల్ల గత రెండేళ్లలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదని ధర్మాన ఆరోపించారు.

  • Loading...

More Telugu News