: 'కార్న్ డ్రిల్ ఛాలెంజ్' ఆమె జుట్టును ఊడగొట్టింది!
అమ్మాయిల నడుము ఎంత సన్నగా ఉంటుందో తెలుసుకునేందుకు ‘ఏ 4 పేపర్ ఛాలెంజ్’, అమియోట్రోపిక్ లేటరల్ స్ల్కె రాసిన్ (ఏఎల్ఎస్) అనే వ్యాధికి గురైన వారిని ఆదుకునే నేపథ్యంలో పుట్టిన ‘ఐస్ బకెట్ ఛాలెంజ్’ లు ఎంతగా ఫేమస్ అయ్యాయో తెలిసిన విషయమే. తాజాగా, చైనాలో ‘కార్న్ డ్రిల్’ పేరుతో ఒక ఛాలెంజ్ ప్రస్తుతం బాగా ప్రజాదరణ పొందింది. ఒక డ్రిల్ మిషన్ కు మొక్కజొన్న కంకిని ఉంచుతారు. అది వేగంగా తిరుగుతున్న సమయంలో కేవలం పది సెకన్లలో దానిని తినేయాలి. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. అయితే, ఈ వీడియోను అనుకరించబోయిన ఒక చైనా మహిళకు చేదు అనుభవం ఎదురైన సంఘటన ఇటీవల చోటుచేసుకుంది. డ్రిల్ మిషన్ వేగంగా తిరుగుతుండగా మొక్కజొన్న కంకిని తింటున్న సమయంలో అకస్మాత్తుగా ఆమె తల జుట్టు ఆ మిషన్ లో ఇరుక్కుపోయింది. అంతే, క్షణాల్లో ఆమె కున్న జుట్టు ఊడి చేతికొచ్చింది. మహిళ తల ముందుభాగంలో జుట్టు ఊడిపోయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి.