: నీట్ పై సుప్రీంకోర్టులో ముగిసిన వాదనలు...సాయంత్రం తీర్పు
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్టు (నీట్) పై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. తెలుగు రాష్ట్రాల తరపున న్యాయవాదులు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. నీట్ ను హిందీ, ఆంగ్ల మాధ్యమాల్లో నిర్వహిస్తున్నందున తెలుగు మీడియంలో చదివిన విద్యార్థులు అన్యాయానికి గురయ్యే ప్రమాదం ఉందని, అదే సమయంలో విద్యార్థులు సీబీఎస్ఈ సిలబస్ ను అనుసరించేందుకు అవసరమైన మౌలిక సదుపాయలు లేవని చెబుతూ, కనీసం ఈ ఏడాదికి నీట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు వాదించాయి. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల వాదనలు విన్న న్యాయస్ధానం తీర్పును రిజర్వులో ఉంచింది. నేటి సాయంత్రం వెబ్ సైట్ లో తీర్పును అప్ లోడ్ చేస్తామని, అక్కడ చదువుకోవాలని సూచించింది. దీంతో న్యాయమూర్తులు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారనే విషయంపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.