: తమిళనాట నెంబర్ గేమ్... విజయానికి 36.5 శాతం ఓట్లు చాలు... 6 శాతం ఓట్లు మారితే జయ గద్దె దిగాల్సిందే!
గడచిన 32 సంవత్సరాల్లో ఒకసారి అధికారంలోకి వచ్చిన పార్టీని మరోసారి గద్దెనెక్కనివ్వని తమిళనాడు ప్రజలు ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల్లో ఎటువంటి తీర్పిస్తారన్న విషయమై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. గత ఎన్నికల్లో జయలలిత నేతృత్వంలోని అన్నా డీఎంకే, కరుణానిధి నేతృత్వంలోని డీఎంకే కూటములు ప్రధానంగా తలపడగా, ఈ దఫా విజయ్ కాంత్, అన్బుమణి రాందాస్ తదితర చిన్న పార్టీల నేతలు కలసి ఓ కూటమిగా ఏర్పడి పోటీకి సన్నద్ధం కావడంతో గెలుపోటముల గణాంకాలు మారిపోయాయి. ప్రస్తుత పరిస్థితుల్లో పోలైన ఓట్లలో 36.5 శాతం ఓట్ల వాటాను పొందిన పార్టీ విజయం సాధిస్తుందని రాజకీయ నిపుణులు లెక్క తేల్చారు. ఇదే సమయంలో గత ఎన్నికల్లో జయలలితకు బ్రహ్మరథం పట్టిన ప్రజల్లో 5.76 శాతం ఓటర్లు తమ మనసు మార్చుకుని డీఎంకే పక్షాన నిలిస్తే, జయలలిత గద్దె దిగక తప్పదని అంచనా వేశారు. 1984 నుంచి జయలలిత, కరుణానిధి పార్టీలు ఒకదాని తరువాత ఒకటి తమిళనాడును పాలిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. గడచిన ఐదేళ్లలో జయలలిత ప్రారంభించిన పలు సంక్షేమ పధకాలు, పేదలకు దగ్గరై వారి రోజువారీ అవసరాలను కనీస ఖర్చుతో తీర్చేందుకు చేపట్టిన పథకాలు ఆమెకు కలిసివచ్చే అంశమని ఓ అంచనా. 2011లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 203 సీట్లను గెలుచుకుని విపక్షమన్న పేరు దాదాపు వినపడకుండా చేసిన జయలలిత కూటమి, ఆపై రెండేళ్ల క్రితం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అదే ఫలితాన్ని నమోదు చేయడంలో విజయం సాధించింది. ఈ రెండేళ్ల వ్యవధిలో జయలలిత ప్రభుత్వానికి ఎంతమంది పేదలు దూరమయ్యారన్న విషయమే ఆమె జయాపజయాలను శాసించనుంది. 2011 ఎన్నికల్లో విపక్షాల ఐక్యతా సూచి 84 పాయింట్ల వద్ద ఉన్న సమయంలోనే, జయలలిత ప్రభావం ఏ స్థాయిలో కనిపించిందో అందరికీ తెలిసిందే. ఇక ఈ సంవత్సరం విపక్షాల ఐక్యత 65 పాయింట్లకు పడిపోయింది. ఇక తమిళనాడు రాష్ట్ర చరిత్ర ప్రకారం, ఓట్లలో సరాసరిన 42 శాతం వాటాను సాధించగలిగితే, 195 సీట్లలో విజయం సాధించవచ్చు. 3 శాతం ఓట్లు మారితే, ఆ ప్రభావం 62 సీట్లలో గెలుపును దూరం చేస్తుంది. ఇక ఐదు శాతం ఓట్లు మారితే 99 స్థానాల్లో, 5.75 శాతం ఓట్లు మారితే 120 స్థానాల్లో విజయం మారిపోతుంది. గత ఎన్నికల్లో జయకు అనుకూలంగా ఓట్లేసిన వారిలో 7 శాతం మంది మనసు మారితే, డీఎంకే కూటమికి 143 సీట్లు, అన్నాడీఎంకేకు 70 సీట్లు వస్తాయని అంచనా. చాలా రాష్ట్రాలు 7 శాతం ఓట్ల స్వింగ్ ను ఎన్నడూ చూడలేదు. తమిళనాట మాత్రం 10 శాతం వరకూ స్వింగ్ నమోదైన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్ల నాడి ఎటు మళ్లుతుందో అన్నది మరో 10 రోజుల్లో తేలిపోతుంది. తమిళనాడులో ఈ నెల 16న ఎన్నికలు, ఆపై 19న దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో లెక్కింపు జరుగుతుందన్న సంగతి తెలిసిందే.