: ప్రధాని సభకు రావాలని నేనెలా ఆదేశిస్తా?: రాజ్యసభ చైర్మన్
అగస్టా వెస్ట్ ల్యాండ్ చాపర్ల కుంభకోణం నేడు రాజ్యసభను కుదిపేసింది. ఈ కేసులో ప్రధాని స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని సభ్యులు పోడియం ముందు నినాదాలు చేస్తుండటంతో సభ కార్యకలాపాలు ఆగిపోయాయి. రాజ్యసభ చైర్మన్ హోదాలో సభను నడిపిస్తున్న హమీద్ అన్సారీ పలుమార్లు సభ్యులు శాంతించి, సంయమనం పాటించాలని చెప్పినా కాంగ్రెస్ సభ్యులు ఆందోళన విరమించలేదు. దీంతో ప్రధాని స్వయంగా సభకు హాజరు కావాలని తానెలా ఆదేశించగలనని అన్సారీ ప్రశ్నించారు. ఆ హక్కు తనకు లేదని, ప్రధానిని సభకు రావాలని కోరలేనని ఆయన స్పష్టం చేశారు. రాజ్యసభలో గందరగోళం కొనసాగుతోంది.