: స్టార్టప్ సంస్థలపై నీలినీడలు... ఐఐటీయన్ల చేతికొచ్చిన ఆఫర్ లెటర్లు వెనక్కి!
దేశంలోని టాప్ ఐఐటీల్లో విద్యను అభ్యసించి, మంచి కంపెనీల్లో ఉద్యోగాలు పొందామన్న వారి ఆశలు అడియాసలయ్యాయి. ఓ వినూత్న ఆలోచనతో కంపెనీలను మొదలు పెట్టిన ఔత్సాహికులు, వాటి విస్తరణలో భాగంగా, లక్షల రూపాయల వేతనాలు ఇస్తామని చెబుతూ ఐఐటీయన్లకు ఆఫర్ లెటర్లు ఇచ్చి, తిరిగి ఇప్పుడు వాటిని వెనక్కు తీసుకుంటున్నారు. నిధుల సమీకరణలో ఇబ్బందులు ఎదురవుతుండటం ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇదే సమయంలో పలు కంపెనీలు మూతపడటం కూడా, గతంలో ఆయా కంపెనీలు ఇచ్చిన ఆఫర్ లు వెనక్కు వెళ్లేలా చేశాయి. భారత స్టార్టప్ కంపెనీల రంగంలో నెలకొన్న మాంద్యం, లాభాలపై ఉన్న ఒత్తిడి సంస్థలు కొత్త ఉద్యోగాలు ఇచ్చేందుకు వెనుకంజ వేసేలా చేస్తున్నాయని ప్లేస్ మెంట్ మేనేజర్లు వ్యాఖ్యానించారు. కాగా, ఢిల్లీ ఐఐటీల్లో విద్యార్థులకు గతంలో ఆఫర్ లెటర్లు ఇచ్చిన రెండు స్టార్టప్ సంస్థలు ఇప్పుడు మూతపడ్డాయి. వీటిల్లో ఉద్యోగాలను చూసుకున్న విద్యార్థులు ఇప్పుడు మరో కంపెనీని వెతుక్కోక తప్పనిసరి పరిస్థితి నెలకొంది. ఐఐటీ బాంబే విషయానికి వస్తే, ఒక సంస్థ ఆఫర్ లెటర్లను వెనక్కు తీసుకోగా, మరో సంస్థ ఆరుగురి జాయినింగ్ తేదీలను తదుపరి నిర్ణయిస్తామని తెలిపింది. గౌహతీ, రూర్కేల్లోని ఐఐటీల్లోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ ఒక స్టార్టప్ సంస్థ ఆఫర్లను వెనక్కు తీసుకోగా, మరో 3 సంస్థలు జాయినింగ్ తేదీని సస్పెన్షన్ లో ఉంచాయి. "ఇదేమంత శుభపరిణామం కాదు. ఇచ్చిన ఆఫర్ లెటర్లను వెనక్కు తీసుకోవడంతో విద్యార్థుల ఆత్మస్థైర్యం దెబ్బతింటోంది" అని ఢిల్లీ ఐఐటీ ట్రైనింగ్ అండ్ ప్లేస్ మెంట్ ఆఫీసర్ అనిష్యా మదన్ వ్యాఖ్యానించారు. ఆఫర్లను వెనక్కు తీసుకున్న కంపెనీల వివరాలను వెల్లడించేందుకు మాత్రం ఆమె నిరాకరించారు. కాగా, ఓలాతో పాటు ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్, జింప్లీ హోం, పెప్పర్ టాప్, ఇన్ మోబీ, రోడ్ రన్నర్ తదితర సంస్థలు ఉద్యోగాలను వెనక్కు తీసుకున్నట్టు విద్యార్థి వర్గాల సమాచారం.