: సింగిల్ ఒరలో ఆ కత్తులు ఇమడలేవు!... రామసుబ్బారెడ్డి ముఖం మీదే తలుపులేసిన ఆది వర్గం!
కడప జిల్లా జమ్మలమడుగులో టీడీపీ వర్గాల మధ్య నెలకొన్న విభేదాలు సమసిపోవడం దర్లభమన్న వాదన వినిపిస్తోంది. ఏళ్లుగా ప్రత్యర్థులుగా కొనసాగుతూ వస్తున్న జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, మాజీ మంత్రి, టీడీపీ నియోజకవర్గ ఇన్ చార్జి రామసుబ్బారెడ్డిలు ఇటీవలే ఒకే పార్టీ నేతలుగా మారారు. అప్పటిదాకా వైసీపీలో ఉన్న ఆదినారాయణరెడ్డి ఇటీవలే టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య రాజీ కుదిర్చేందుకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు చేసిన యత్నాలు ఓ దశలో ఫలించినట్లే కనిపించినా, ఆ యత్నాలన్నీ నిష్ఫలమేనని తేలిపోయింది. మొన్నటికి మొన్న రామసుబ్బారెడ్డికి స్వాగతం పలికిన టీడీపీ కార్యకర్తలను ఆది వర్గం బెదిరింపులకు గురి చేసింది. తాజాగా ఆది వర్గానికి మంచి పట్టున్న బొరిగెనూరు పర్యటనకు వెళ్లిన రామసుబ్బారెడ్డికి షాక్ తగిలింది. రామసుబ్బారెడ్డి పర్యటనను వ్యతిరేకించిన ఆది వర్గానికి చెందిన కార్యకర్తలు ఆయన ముఖం మీదే తలుపులేసి నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న ఆదినారాయణరెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు పట్టున్న గ్రామాల్లో తన అనుమతి లేకుండా రామసుబ్బారెడ్డి ఎలా పర్యటిస్తారని ప్రశ్నించిన ఆది... దీనిపై పార్టీ అధినేతకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు.