: తొలి భారత ప్రధానిని పాఠ్య పుస్తకం నుంచి 'డిలీట్' చేసిన రాజస్థాన్!
రాజస్థాన్ లోని బీజేపీ ప్రభుత్వం మరో రాజకీయ వివాదాన్ని రేపింది. 8వ తరగతి సాంఘిక శాస్త్రం పుస్తకంలో భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పేరును చెరిపేసింది. భారత చరిత్రను గురించి చెబుతూ, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, వీర సావర్కార్, భగత్ సింగ్ తదితరులతో పాటు స్వాతంత్ర సమరయోధుడిగా పెద్దగా పరిచయం లేని హేము కలానీ వంటి వారి పేర్లను జోడించిన ఈ పుస్తకంలో నెహ్రూ ప్రస్తావనే లేదు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి చెబుతూ, ఓ చాప్టర్ నే పొందుపరిచారు. భారత తొలి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ అని పేర్కొంటూనే, తొలి ప్రధానిని మరువడం కావాలని చేసిన పనేనని రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సచిన్ పైలట్ విమర్శించారు. భారత తొలి ప్రధాని పేరును ఎలా తొలగిస్తారని ప్రశ్నించిన ఆయన, జరిగిన తప్పిదాన్ని వెంటనే సరిచేసుకోవాలని, ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజస్థాన్ విద్యా శాఖ కావాలని చేసిన పనే ఇదని అన్నారు. కాగా, రాజస్థాన్ విద్యా శాఖ ఇటీవలి పలు నిర్ణయాలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. పాఠశాలల్లో సూర్య నమస్కారాలను తప్పనిసరి చేసినప్పుడు, అక్బర్ సంబోధన 'ది గ్రేట్'ను తొలగించి, దాన్ని మహారాణా ప్రతాప్ కు జోడించినప్పుడు వివాదాలు చెలరేగాయి.