: కొత్తపల్లికి ఫోన్ చేసిన చంద్రబాబు!... టీడీపీలోకి వైసీపీ ‘పశ్చిమ’ అధ్యక్షుడి ఎంట్రీకి లైన్ క్లియర్!


ఏపీలో విపక్ష పార్టీ వైసీపీకి పశ్చిమగోదావరి జిల్లాలో భారీ ఎదురు దెబ్బే తగలనుంది. గడచిన ఎన్నికల్లో జిల్లాలో ఆ పార్టీ సింగిల్ సీటును కూడా సాధించలేకపోయింది. సెంట్రల్ ఆంధ్రాలో సత్తా చాటిన టీడీపీ... పశ్చిమగోదావరి జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో ప్రత్యేకంగా ప్రస్తావించిన చంద్రబాబు... అభివృద్ధి, నిధుల కేటాయింపులో ఆ జిల్లాకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు కూడా ప్రకటించారు. ఈ క్రమంలో టీడీపీలోకి మొదలైన వలసల్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు... తన సొంత పార్టీ టీడీపీ వైపు చూశారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉండగా, ఆయన కేబినెట్ లో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన సుబ్బారాయుడు మంచి పనితీరును కనబరిచారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీడీపీకి హ్యాండిచ్చిన కొత్తపల్లి... మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించిన ప్రజారాజ్యంలో చేరిపోయారు. ఆ తర్వాత ఆ పార్టీ అంతర్థానం కావడంతో వైసీపీలో చేరిపోయారు. గడచిన ఎన్నికల్లో ఓటమిపాలైన కొత్తపల్లి ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడి హోదాలో కొనసాగుతున్నారు. సొంత గూటికి చేరేందుకు కొత్తపల్లి చేస్తున్న యత్నాలు తెలుసుకున్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిన్న రాత్రి స్వయంగా కొత్తపల్లికి ఫోన్ చేశారు. పార్టీలోకి రావాలని ఆయన కొత్తపల్లికి ఆహ్వానం పలికారు. తాను కూడా తన సొంత గూటికి చేరేందుకే సిద్ధంగా ఉన్నానని చెప్పిన సుబ్బారాయుడు.. త్వరలోనే పార్టీలో చేరతానని చెప్పారు. తాను కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనకు వెళుతున్నానని, తిరిగి వచ్చిన తర్వాత కలుద్దామని చంద్రబాబు ఆయనకు చెప్పారు. సుముహూర్తం చూసుకుని పార్టీలో చేరతానని కొత్తపల్లి పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News