: అప్పన్న నిజరూప దర్శనం షురూ!... క్యూ కట్టిన టీడీపీ నేతలు!


విశాఖ జిల్లా సింహాచలంలోని అప్పన్న సన్నిధిలో శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి నిజరూప దర్శనం నేటి తెల్లవారుజాము నుంచి ప్రారంభమైంది. స్వామి వారిని నిజరూపంలో దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తజనం ఆలయానికి పోటెత్తింది. అప్పన్న సన్నిధి అనువంశిక ధర్మకర్తగా ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన టీడీపీ సీనియర్ నేత, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు సతీసమేతంగా స్వామి వారిని దర్శించుకున్నారు. ధర్మకర్త హోదాలో స్వామివారిని గజపతిరాజే అందరికంటే ముందుగా దర్శించుకుని తరించారు. ఇక అప్పన్నను నిజరూపంలో దర్శించుకునేందుకు టీడీపీ నేతలు పెద్ద ఎత్తున సింహాచలానికి తరలివచ్చారు. తెల్లవారుజామునే పార్టీ సీనియర్ నేత, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు స్వామివారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, ఎంపీ గోకరాజు గంగరాజు, పలువురు ఎమ్మెల్యేలతో పాటు పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు అప్పన్నను దర్శించుకున్నారు.

  • Loading...

More Telugu News