: క్లింటన్ ను టార్గెట్ చేసిన ట్రంప్... వివాదాస్పద వ్యాఖ్యలు
వివాదాస్పద వ్యాఖ్యలకు, వ్యక్తిగత విమర్శలకు పెట్టింది పేరైన డొనాల్డ్ ట్రంప్ మరోసారి నోటికి పనిచెప్పారు. గతంలో రిపబ్లికన్ పార్టీ ప్రత్యర్థులను లక్ష్యం చేసుకుని విమర్శలు చేసిన ట్రంప్, అధ్యక్ష పదవికి తమ పార్టీలో తానే అభ్యర్థినని నిర్ధారించుకుని, ఈసారి డెమొక్రాట్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ పై విమర్శలు మొదలు పెట్టారు. ఆమె భర్త బిల్ క్లింటన్ పై ట్రంప్ తీవ్ర స్థాయి వ్యాఖ్యలు చేశారు. అమెరికా రాజకీయ చరిత్రలో అత్యంత హీనమైన అధ్యక్షుడిగా బిల్ క్లింటన్ నిలిచిపోతారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. స్కర్టు కనిపిస్తే చాలు, క్లింటన్ వదిలేవాడు కాదని ట్రంప్ విమర్శించారు. ఒకరా? ఇద్దరా? ఆయన బారినపడి ఎంతో మంది మహిళలు మోసపోయారని ఆయన ఆరోపించారు. తన చేతిలో మోసపోయిన మహిళలను క్లింటన్ పరాభవానికి గురిచేస్తే...వారి పట్ల హిల్లరీ దారుణంగా వ్యవహరించారని ఆయన పేర్కొన్నారు. బాధిత మహిళలకు క్లింటన్ చేసిన నష్టం కంటే హిల్లరీ ఎక్కువ నష్టం చేశారని ఆయన అభిప్రాయపడ్డారు. హిల్లరీది కుటిల మనస్తత్వమని ఆయన విమర్శించారు. కాగా, గతంలో ట్రంప్ పలువురు మహిళలపై తీవ్ర విమర్శలు చేసి, విమర్శలు పెరగడంతో క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే.