: విశాఖలో నేడు మ్యాచ్...ఎవరు లోకల్? ఎవరు నాన్ లోకల్?
ఐపీఎల్-9లో భాగంగా ముంబయి ఇండియన్స్, సన్‌రైజర్స్ మధ్య విశాఖలో నేటి సాయంత్రం 4గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. విశాఖలోని డాక్టర్ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో తెలుగు జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. కాగా, హోం జట్టు ముంబై ఇండియన్స్ లో ఇద్దరు హోం బాయ్స్ ఉండగా, సన్ రైజర్స్ జట్టులో ఒక్క తెలుగువాడు లేకపోవడం విశేషం. రోహిత్ శర్మ బాల్యం వైజాగ్ లో గడిచిన సంగతి తెలిసిందే. ఆ జట్టులో మరో కీలక ఆటగాడు అంబటి రాయుడు గుంటూరుకు చెందిన వ్యక్తి అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖను హోం గ్రౌండ్ గా ఎంచుకోవడంతో వారిద్దరూ హోం బాయ్స్ గా మారారు. ఇక పేరుకే హైదరాబాదు జట్టైన సన్ రైజర్స్ లో ఒక్క తెలుగు ఆటగాడు కూడా లేకపోవడం విశేషం. ఈ నేపథ్యంలో లోకల్ గా పేరుపడిన నాన్ లోకల్ జట్టుతో హైదరాబాదు విశాఖలో సత్తా చాటనుంది. కెప్టెన్ వార్నర్, కెప్టెన్ రోహిత్ మధ్య పోరుగా ఈ మ్యాచ్ ను అభివర్ణించవచ్చు. ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్న వార్నర్ టోర్నీలో టాప్ స్కోరర్ గా నిలుస్తున్నాడు. అతనికి తోడు ధావన్ కూడా కుదురుకోవడంతో సన్ రైజర్స్ విజయాల బాటపట్టింది. ముంబై ఇండియన్స్ హోం గ్రౌండ్ లో సత్తాచాటేందుకు సిద్ధమైంది. నిన్నటి నుంచే ప్రాక్టీస్ ప్రారంభించి సన్ రైజర్స్ కు షాకివ్వాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో నేటి సాయంత్రం పసందైన క్రికెట్ విందు అభిమానులకు అందడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా, మ్యాచ్ దృష్ట్యా పోలీసులు పోతినమల్లయ్యపాలెం స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. స్టేడియం వద్ద 1000 మంది పోలీసులతో గట్టి భద్రత ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలతో అక్కడి ఎండాడ జంక్షన్ వరకే వాహనాల రాకపోకలను అనుమతించనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అక్కడ జరిగే అన్ని మ్యాచులకు ఈ ఆంక్షలు వర్తిస్తాయని తెలిపారు. మ్యాచ్ ప్రారంభానికి రెండు గంటల ముందు నుంచి స్టేడియంలోకి అనుమతిస్తామని పేర్కొన్నారు.