: తాతముత్తాల ఊరికి నేడు 'శ్రీమంతుడు'!
తన పూర్వీకుల స్వగ్రామమైన గుంటూరు జిల్లా బుర్రిపాలెంకు ప్రిన్స్ మహేష్ బాబు నేడు వెళ్లనున్నారు. ఈమధ్య వచ్చిన సూపర్ హిట్ 'శ్రీమంతుడు' సినిమా తరువాత మహేష్ బాబు ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. మార్చిలో మహేష్ సతీమణి, సోదరి స్వయంగా వచ్చి ఆ గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మరో రెండు నెలల్లో మహేష్ మీ ఊరొస్తారని వారు గ్రామస్తులకు మాటిచ్చారు. ఆ మాట ప్రకారమే...ఆయన నేడు రోడ్డు మార్గంలో బుర్రిపాలెం చేరుకోనున్నారు. 11:30 నిమిషాలకు మహేష్ కనక దుర్గమ్మ వారధి దగ్గరకు చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటకు 3306 జనాభా కలిగిన బుర్రిపాలెంలో అడుగుపెట్టనున్నారు. సొంత ఇంటికి వెళ్లి, నాయనమ్మ, మాజీ సర్పంచ్ నాగరత్నం నిర్మించిన గీతామందిరంలో దైవదర్శనం చేసుకుంటారు. అనంతరం పలు సమస్యల పరిష్కారం దిశగా, పలు పనులు ప్రారంభించనున్నారు. మహేష్ రానుండడంతో బుర్రిపాలెం వాసుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.