: ‘బాలికపై ఎమ్మెల్యే రేప్’ కేసులో కీలక నిందితుడి లొంగుబాటు
అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న గోవా ఎమ్మెల్యే బాబుష్ మాన్సెరేటాకు వ్యతిరేకంగా పోలీసులకు మరిన్ని కీలక ఆధారాలు లభించాయి. ఈ కేసులో ఒకానొక కీలక నిందితుడిగా ఉన్న రోసీ ఫెర్రోస్ శనివారం గోవా క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ముందు లొంగిపోయాడు. కేసు నమోదైన దగ్గర నుంచి ఇతడు తప్పించుకుని తిరుగుతున్నాడు. లొంగిపోయిన ఫెర్రోస్ నుంచి పోలీసులు కీలకమైన ఆధారాలను సేకరించారు. కేసును కీలక మలుపు తిప్పుతుందని భావిస్తున్న బాధిత బాలిక మొబైల్ ఫోన్ ను ఫెర్రోస్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. బాధితురాలి సవతి తల్లిని ఎమ్మెల్యేకు ఫ్రెర్రోస్ పరిచయం చేయగా... ఆమె 50 లక్షల రూపాయలకు కుమార్తెను ఎమ్మెల్యేకు విక్రయించి ఉంటుందని భావిస్తున్నారు. పోలీసులు ఈ కేసులో లోగడే బాధితురాలి సవతి తల్లిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. గోవాలోని తన బంగళాలో 16 ఏళ్ల నేపాలీ బాలికపై ఎమ్మెల్యే బాబుష్ అత్యాచారం చేసినట్టు ఆరోపణలు రాగా, అప్పటి నుంచి ఆయన పోలీసుల అదుపులోనే ఉన్నారు. అత్యాచారం, మహిళల అక్రమ రవాణా ఆరోపణల కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన బాబూస్ ఆ తర్వాత ఆ పార్టీకి దూరమై ఇండిపెండెంట్ గా ఉంటున్నారు. లోగడ బలవంతపు వసూళ్ల ఆరోపణలతో ఇతడిపై ఓ కేసు దాఖలైంది. బాబూస్ కుమారుడు రోహిత్ సైతం ఐదేళ్ల క్రితం జర్మనీ బాలికపై అత్యాచారం చేసిన కేసులో అరెస్టయ్యాడు. ఆ తర్వాత నిర్దోషిగా బయటపడ్డాడు.