: కాశ్మీర్ లో భారీ ఎన్ కౌంటర్... ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం
ఉగ్రవాదుల చొరబాట్లు, పొరుగు దేశం పాకిస్థాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనలతో నిత్యం కాల్పుల శబ్దంతో మోత మోగుతున్న జమ్మూ కాశ్మీర్ లో నేటి ఉదయం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఆ రాష్ట్రంలోని పుల్వామా జిల్లా పరిధిలోని పంజ్ గమ్ గ్రామంలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుపెట్టింది. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పుల అనంతరం సైన్యం నిర్వహించిన సోదాల్లో ముగ్గురు ఉగ్రవాదుల మృతదేహాలు లభించాయి. అంతేకాకుండా ఉగ్రవాదులు తమ వెంట తెచ్చుకున్న ఆయుధాలను సైన్యం స్వాధీనం చేసుకుంది. చనిపోయిన ముగ్గురు ఉగ్రవాదులతో పాటు మరికొంతమంది ముష్కరులు కూడా రంగంలోకి దిగి ఉంటారని అనుమానిస్తున్న సైనిక బలగాలు ఆ ప్రాంతంలో ముమ్మర సోదాలు చేస్తున్నారు. చనిపోయిన ఉగ్రవాదులను హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు చెందినవారుగా గుర్తించారు.