: తోక జాడిస్తే.... కట్ చేసేస్తా!: విపక్ష నేత వైఎస్ జగన్ కు చంద్రబాబు చురకలు!
ఏపీలో విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబునాయుడు మరోమారు ఫైరయ్యారు. తోక జాడిస్తే... కట్ చేసేస్తానంటూ తీవ్ర పదజాలంతో ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిన్న విజయవాడలో నీరు-చెట్టు కార్యక్రమంలో పాలుపంచుకున్న సందర్భంగా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఇప్పుడు మాట్లాడుతున్న వారంతా ఆనాడు కుట్రపూరితంగా వ్యవహరించారని చంద్రబాబు ఆరోపించారు. తాను ఏపీకి వెన్నుపోటు పొడిచానని కొన్ని పత్రికల్లో ఫొటోలు వేసి దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ను లక్ష్యంగా చేసుకుని కీలక వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు ఇక ఎంతమాత్రం సహించేది లేదని తేల్చిచెప్పారు. ‘‘రాష్ట్రంలో పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులు సహా నూతన రాజధాని అమరావతి... ఇలా అన్నిటినీ అడ్డుకునే యత్నం చేస్తున్నారు. చివరకు కాపుల ఉద్యమంలో ప్రవేశించి దారుణంగా వ్యవహరించారు. అయినా నా ముందు ఆటలు సాగవు. ఎవరైనా సరే తోక జాడిస్తే కట్ చేస్తా. ఆనాడు ఇరు రాష్ట్రాల పెద్దలను కూర్చోబెట్టి మాట్లాడి, ఏం ఇస్తారో చెప్పి విభజన చేయాలని సూచించాను. దానిని పట్టించుకోకుండా ఇష్టానుసారం చేశారు. యుద్ధ విమానంలో హైదరాబాదుకు విభజన బిల్లు తెచ్చారు. పార్లమెంటు తలుపులు మూసి టీవీలు ఆపేసి దారుణంగా విభజన చేశారు. ఇవన్నీ మరోసారి గుర్తు చేసుకుని కసిగా పనిచేయాలన్న పట్టుదల ప్రజల్లో రావాలనే మరోమారు చెబుతున్నా. ఆనాడు వైసీపీ కపట నాటకాలాడింది. అప్పటివరకు జైల్లో ఉన్న జగన్... విభజన బిల్లు రాగానే బయటకు వచ్చారు. ఇదంతా కుట్రపూరితంగా జరిగింది. అయినా ప్రజలు టీడీపీపై నమ్మకంతోనే మాకు ఓటేశారు’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.