: ఆంధ్రులంతా ఆదివారం ఒక్క రోజు రోడ్లపైకి రావాలి: శివాజీ
ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని ప్రత్యేక హోదా సాధనా సమితి అధ్యక్షుడు, నటుడు శివాజీ అన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని ఏపీ ప్రజలను నమ్మించి మోసం చేయవద్దని హెచ్చరించారు. ప్రత్యేక హోదాకు మద్దతుగా శుక్రవారం సాయంత్రం విజయవాడలోని రామవరప్పాడు సెంటర్ లో జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద సమితి ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమంలో శివాజీతోపాటు చలసాని శ్రీనివాస్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, విద్యార్థి సంఘాల వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు బీజేపీ భగావో, ఆంధ్రాకో బచావో అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా శివాజీ, చలసాని మాట్లాడుతూ... ప్రత్యేక హోదాకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్రజలంతా ఆదివారం ఒక్కరోజు రోడ్లపైకి వచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ పాల్గొంటేనే వారి కల సాకారం అయిందని గుర్తు చేశారు. అదే విధంగా ప్రత్యేక హోదా సాధన కోసం ఆంధ్రులంతా ఏకమై పోరాడాలని కోరారు. ఒకప్పుడు రెండు సీట్లు కూడా లేని బీజేపీకి దేశాన్ని పాలించే అధికారం ఇస్తే మోసం చేస్తారా? అని శివాజీ ప్రశ్నించారు. ఈ నెల 8వ తేదీ నుంచి అనంతపురంలో నిరవధిక దీక్ష చేపడుతున్నట్టు ప్రకటించారు. హోదా ఇస్తామని కేంద్ర మంత్రి వెంకయ్య మోసం చేశారని, ఏపీ తరఫున రాజ్యసభకు పోటీ చేయవద్దని సీపీఐ నేత రామకృష్ణ సూచించారు. రాజ్యసభకు వెంకయ్య నామినేషన్ వేస్తే నల్లజెండాలతో నిరసన తెలుపుతామన్నారు. ప్రత్యేక హోదా కోసం ఎంతటి త్యాగాలకైనా వెనుకాడబోమని చలసాని అన్నారు.