: చల్లటి కబురు... మరో మూడు రోజులు వాతావరణం ఇంతే!
తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురందించింది. మరో మూడు రోజుల పాటు తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తాజాగా బులెటిన్ విడుదల చేసింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన కూడా కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. క్యుములోనింబస్ మేఘాల వల్లే ఇలా వర్షాలు కురుస్తున్నాయని స్పష్టం చేసింది. విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కొనసాగుతున్న అల్పపీడన ద్రోణికి తోడు తెలంగాణపై ఉపరితల ఆవర్తనం ఏర్పడడం కూడా వర్షాలకు కారణంగా పేర్కొంది. ఈ ఆవర్తనం తొలగిపోయాక మళ్లీ ఎండల తీవ్రత ఉంటుందని తెలిపింది. శుక్రవారం తెల్లవారుజామున తెలంగాణ వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే.