: టీడీపీలో చేరికకు మూడు కారణాలు చెప్పిన ఎస్వీ
శనివారం కర్నూలులో సీఎం చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించిన వైసీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి తన నిర్ణయం వెనుకనున్న మూడు ప్రధాన కారణాలను వెల్లడించారు. మొన్నటి వరకూ వైసీపీ ఎమ్మెల్యేలుగా ఉన్న భూమా నాగిరెడ్డి, భూమా అఖిలప్రియ టీడీపీలో చేరిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో భూమా అఖిలప్రియపై ఎస్వీ మోహన్ రెడ్డి చిన్నాన్న ఎస్వీ నాగిరెడ్డిని పోటీకి నిలబెట్టాలని వైసీపీ అధినేత జగన్... మోహన్ రెడ్డిపై ఒత్తిడి తీసుకొచ్చారట. తన చెల్లెలు కుమార్తెపై తామే పోటీకి దిగాలని కోరడం బాధ కలిగించిందని మోహన్ రెడ్డి చెప్పారు. తమ కుటుంబంలో చీలిక తెచ్చే ప్రయత్నంగా దీన్ని పేర్కొన్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సాగు నీటి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా జగన్ ఈ నెల 16 నుంచి మూడు రోజుల పాటు కర్నూలులో నిరాహార దీక్ష చేపడుతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. కర్నూలు ఎమ్మెల్యే అయిన ఎస్వీ మోహన్ రెడ్డికి ఈ విషయాన్ని జగన్ మాట మాత్రంగానైనా చెప్పలేదట. ఇది కూడా తనను బాధించినట్టు ఎస్వీ తెలిపారు. చివరి కారణం... ప్రజా ప్రతినిధిగా ఎన్నికై రెండు సంవత్సరాలు అవుతున్నా ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నామని ఆవేదన చెందారు. జిల్లా అభివృద్ధి విషయంలో సీఎం చంద్రబాబు హామీ ఇవ్వడంతో ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు ఎస్వీ మోహన్ రెడ్డి వివరించారు. తన తండ్రి ఎస్వీ సుబ్బారెడ్డి గతంలో చంద్రబాబు మంత్రివర్గంలో పనిచేశారని, మచ్చలేకుండా రాజకీయాల్లో కొనసాగుతున్నామని గుర్తు చేశారు.