: సీఐఏ అధికారిపై పాక్ ఐఎస్ఐ విష ప్రయోగం?


ఏనాటికైనా చైనాతో ప్రమాదమని భావించిన అమెరికా, ఇటీవలి కాలంలో భారత్ తో మైత్రిని పెంచుకుంది. అయితే, భారత్ తమ మాట ఏకపక్షంగా వినే పరిస్థితి లేదని గ్రహించిన అమెరికా ద్వంద్వ నీతిలో భాగంగా పాకిస్థాన్ తో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకుంది. అయితే, పాక్ ఏమీ తక్కువ తినలేదు. అల్ ఖైదా అధినేత ఒసామాబిన్ లాడెన్ ను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన అమెరికా గూఢచారి సంస్థ సీఐఏ ఏజెంట్ మార్క్ కెల్టన్ పై పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ విషప్రయోగం చేసిందని వాషింగ్టన్ పోస్ట్ కధనం ప్రసారం చేసింది. ఆల్ ఖైదా చీఫ్ ఒసామాబిన్ లాడెన్ ను 2011 మే 4న అమెరికన్ సీల్స్ అబాటోబాద్ లో వేటాడి చంపిన తరువాత సరిగ్గా రెండు నెలలకు మార్క్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను పాక్ నుంచి స్వదేశానికి రప్పించారు. మరణం అంచుల వరకు వెళ్లిన ఆయన అనారోగ్యానికి కారణాన్ని వైద్యులు కనుగొనడానికి చాలా సమయం పట్టింది. చివరికి ఆయనపై విష ప్రయోగం జరిగిందని తేల్చారు. ఆఖరికి పొత్తికడుపు దగ్గర ఆపరేషన్ చేసి ఆయనను బతికించారు. తనపై విషప్రయోగం జరిగిందని తెలుసుకున్న మార్క్, గూఢచార సంస్థల్లో పని చేసేవారిపై ఇలాంటి దాడులు సర్వసాధారణమని చెప్పారు. అయితే ప్రపంచానికి శత్రువైన లాడెన్ ను చంపడంలో భాగమైనందుకు సంతోషంగా ఉందని అన్నారు. కాగా, ఆయనపై విషప్రయోగం జరిగిందనేందుకు తగ్గ ఆధారాలు లభించే అవకాశాలు లేనందున పాక్ ను నిందించలేమని ఆ కథనంలో పేర్కొంది. కాగా, గతంలో జర్నలిస్టులు, దౌత్యవేత్తలు, గూఢచారులపై విషప్రయోగాలు జరిగాయని వారు వెల్లడించారు. అయితే పాకిస్థాన్ కు చైనా బాగా దగ్గరవుతున్న సమయంలో, ఇలాంటి విషయాన్ని వెల్లడి చేసి ఇబ్బందుల్లో పడే కంటే దీనిపై మౌనంగా ఉండడమే కరెక్ట్ అని భావించిన అమెరికా చడీచప్పుడు లేకుండా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News