: సుబ్రహ్మణ్యస్వామి ఏ ఆధారంతో ఆరోపణలు చేస్తున్నారు?... ఆయన చేతికి అవెలా చిక్కాయి?: కాంగ్రెస్ ఎదురుదాడి


అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణంపై కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడి ప్రారంభించింది. రాజ్యసభలో హెలికాప్టర్ల కుంభకోణంలో కాంగ్రెస్, సోనియా గాంధీ పాత్రపై బీజేపీ దాడికి దిగింది. ఆ పార్టీనేత సుబ్రహ్మణ్యస్వామి ఇటలీ కోర్టు తీర్పులో వెల్లడించిన విషయాలను సభ ముందుకు తీసుకొచ్చి మరీ ఆరోపణలు గుప్పించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడి ప్రారంభించింది. సీబీఐ, ఈడీ చేతిలో ఉండాల్సిన కీలక, రహస్య పత్రాలు సుబ్రహ్మణ్యస్వామి చేతికి ఎలా వచ్చాయని కాంగ్రెస్ నిలదీసింది. ఆధారాలు లేకుండా ఆయన ఆరోపణలు చేస్తే చర్యలు తీసుకోవాలని డిప్యూటీ ఛైర్మన్ కురియన్ ను కోరారు. ఆధారాలు ఉంటే సభకు సమర్పించాలని వారు డిమాండ్ చేశారు. దీనిపై కురియన్ మాట్లాడుతూ, ప్రామాణిక పత్రాలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేశామని, అందజేయని పక్షంలో నిబంధనల ప్రకారం ఏం జరగాలో అదే జరుగుతుందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ వివరణ ఇస్తూ, ఆయన చేసిన ఆరోపణలకు సంబంధించిన పత్రాలను సభకు సమర్పిస్తానని స్వామి చెప్పారని అన్నారు. దీనిపై జైరాం రమేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన చేసిన ఆరోపణలకు ప్రామాణికత ఉందా? అవి ఈ క్షణం సభకు అందుబాటులో ఉన్నాయా? అని నిలదీశారు.

  • Loading...

More Telugu News