: ‘అగస్టా’ లంచం రూ.227 కోట్లు!... పొలిటీషియన్ల వాటా రూ.115 కోట్లు: తేల్చేసిన ఇటలీ కోర్టు


వీవీఐపీల సేవల కోసం భారత ప్రభుత్వం కొనుగోలు చేసిన అగస్టా హెలికాప్టర్ల వ్యవహారంలో కుంభకోణం జరిగిందని ఇటలీ కోర్టు తేల్చేసింది. అంతేకాకుండా ఈ వ్యవహారంలో చేతులు మారిన లంచాల విలువను కూడా ఆ దేశ కోర్టు నిగ్గు తేల్చింది. తిలా పాపం తలా పిడికెడు అన్న చందంగా ఈ వ్యవహారంలో అధికారులతో పాటు రాజకీయ నేతలు వాటాలేసుకుని మరీ బొక్కేశారు. అగస్టా వెస్ట్ ల్యాండ్ కంపెనీ నుంచి 12 హెలికాప్టర్ల కొనుగోలుకు భారత ప్రభుత్వం మొత్తం రూ.3,600 కోట్లు వెచ్చించింది. ఈ భారీ కాంట్రాక్టును దక్కించుకునేందుకు అగస్టా కంపెనీ ఏకంగా 30 మిలియన్ యూరోలను లంచాల రూపంలో ఖర్చు చేసింది. ఈ మొత్తం మన కరెన్సీలో లెక్కిస్తే... రూ.227 కోట్లుగా తేలింది. ఇందులో రాజకీయ నేతల వాటాను ఆ కోర్టు రూ.115 కోట్లుగా తేల్చింది. ఈ మేరకు 225 పేజీల తీర్పు కాపీలో ఇటలీ కోర్టు స్పష్టంగా పేర్కొంది. తీర్పు కాపీలోని 9వ పేజీలోనే పేర్కొన్న ఈ అంశాలను ఓ సారి పరిశీలిస్తే... ఎవరికెంత ముడుపులు చెల్లించామన్న విషయాన్ని అగస్టా కంపెనీ ఓ చిత్తు కాగితంపై ‘కోడ్ నేమ్’లతో రాసుకుంది. దీనిని ఆ కంపెనీ ముడుపులుగా కాకుండా ‘బడ్జెట్ ఎక్స్ పెండిచర్’గా పేర్కొనడం విశేషం. ఇక ముడుపుల విషయానికొస్తే... ‘ఎఫ్ఎంఏ’గా పేర్కొన్న వ్యక్తికి 15 నుంచి 16 మిలియన్ల యూరోలు, ‘ఏపీ’కి 3 మిలియన్ యూరోలు, జేఎస్ ఎయిర్ కు 8.4 మిలియన్ యూరోలు, డీసీహెచ్ కు 1.5 మిలియన్ యూరోలు ముట్టజెప్పింది. ఇక ‘ఎఫ్ఎంఏ’గా పేర్కొన్న వ్యక్తి మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎస్పీ త్యాగి కుటుంబంగా నిర్ధారణ అయ్యింది. ‘ఏపీ’గా పేర్కొన్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ అని ఈ తీర్పు కాపీలోని 204వ పేజీలో ఇటలీ కోర్టు తేల్చేసింది.

  • Loading...

More Telugu News