: ఒక్కొక్కరికి లక్ష ఫాలోయర్లు ఉండాలి...కేంద్ర మంత్రులకు మోదీ దిశానిర్దేశం
సామాజిక మాధ్యమంలో చురుగ్గా ఉండే ప్రధాని నరేంద్ర మోదీ సహచర మంత్రులకు టెక్ పాఠాలు బోధిస్తున్నారు. శాఖల పని తీరు, కేబినెట్ నిర్ణయాలపై పలువురు మంత్రులతో మాట్లాడారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండాలని వారికి సూచించారు. ప్రతి కేంద్ర మంత్రి కనీసం లక్ష మంది ఫాలోయర్లను కలిగి ఉండాలని చెప్పారు. ఎక్కువ పోస్టులు పెట్టాలని సూచించారు. చదివేవారికి అర్థమయ్యేలా సూటిగా, స్పష్టంగా ఉండాలని అన్నారు. ప్రభుత్వ పథకాలు, చేపట్టనున్న పనులు, ప్రగతి అంశాలు తదితరాల గురించి నిత్యం సోషల్ మీడియాలో పోస్టులు ఉండేలా జాగ్రత్తపడాలని ఆయన వారికి తెలిపారు. ఇలా చేయడం వల్ల ప్రజల్లో పార్టీకి ఆదరణ పెరుగుతుందని ఆయన తెలిపారు. కేంద్రమంత్రుల్లో పలువురు చురుగ్గా ఉండడాన్ని ఆయన అభినందించారు. అదే సమయంలో సోషల్ మీడియాలో చురుగ్గాలేని వారి తీరుపై ఆయన గుర్రుగా ఉన్నారని సమాచారం.