: సోనియా, రాహుల్ గాంధీలకు వ్యతిరేకంగా సాక్ష్యాలు సంపాదించా: కోర్టుకు చెప్పిన సుబ్రహ్మణ్యస్వామి


నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కుమారుడు, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు మరింత విషమ పరిస్థితులను ఎదుర్కోక తప్పేలా లేదు. ఇప్పటికే ఈ కేసులో తల్లీకొడుకులు తొలిసారిగా కోర్టు మెట్లెక్కారు. తాజాగా ఈ కుంభకోణంలో వారికి వ్యతిరేకంగా సాక్ష్యాలు కూడా సంపాదించానని బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి చెప్పారు. నిన్న పాటియాలా హౌజ్ కోర్టులో ఈ కేసుకు సంబంధించిన విచారణ జరిగింది. విచారణకు హాజరైన స్వామి తరఫు న్యాయవాది సాక్ష్యాలకు సంబంధించిన ప్రస్తావన చేశారు. తదుపరి విచారణ సందర్భంగా సోనియా, రాహుల్ లకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పే వారి జాబితాను అందజేస్తామని ఆయన ప్రకటించారు. అసలు ఈ కేసును తిరగదోడింది సుబ్రహ్మణ్యస్వామే. పట్టు వదలని విక్రమార్కుడిలా న్యాయ పోరాటం చేస్తున్న స్వామి... ఈ కేసులో సోనియా, రాహుల్ లతో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలకు నోటీసులు జారీ చేయించారు. అంతేకాకుండా అప్పటిదాకా కోర్టు ముఖం చూడని సోనియా, రాహుల్ లను ఆయన కోర్టు మెట్లెక్కించారు. ఈ కేసులో నిందితులకు తప్పకుండా శిక్ష పడేలా చేసి తీరతానని ప్రకటించిన ఆయన... సాక్షులను కూడా కోర్టు ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించడంతో ఈ కేసు ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి.

  • Loading...

More Telugu News