: తొమ్మిది నెలలుగా బాలికపై దాష్టీకం...జరిమానాతో సరిపెట్టిన గ్రామ పెద్దలు.. రంగంలోకి దిగిన పోలీసులు
తెలంగాణలో దారుణం చోటుచేసుకుంది. తొమ్మిదో తరగతి పూర్తి చేసిన యువతికి మాయమాటలు చెప్పి ఒక దుర్మార్గుడు లొంగదీసుకుని స్నేహితుడికి తార్చాడు. వీరి నిర్వాకం చూసిన మరో ఇద్దరు బ్లాక్ మెయిల్ చేసి ఆమెను అనుభవిస్తే...ఈ ఘనకార్యానికి పంచాయతీ పెద్దలు 2.5 లక్షల రూపాయల జరిమానా విధించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తెలంగాణ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...ఆదిలాబాద్ జిల్లా కాసింపేట మండలం పల్లంగూడకు చెందిన బాలిక నాలుగు కిలోమీటర్ల దూరంలోని కాసింపేట జడ్పీహెచ్ హైస్కూలుకు రోజూ ఆటోలో వెళ్తుండేది. ఆమెకు మాయమాటలు చెప్పిన ఆటో డ్రైవర్ మహేందర్ 9 నెలల క్రితం లోబరుచుకున్నాడు. అప్పటి నుంచి ప్రతిరోజూ ఆమెపై లైంగికదాడికి పాల్పడుతున్నాడు. కొన్ని రోజుల తరువాత అతని స్నేహితుడైన అట్కపురం విజయ్ కోరిక తీర్చాలని బలవంతం చేసి, అతని కోరికను తీర్చాడు. దీనిని గమనించిన నేతుల ప్రశాంత్, తాళ్లపల్లి సంతోష్ బాలికను బ్లాక్ మెయిల్ చేసి వాంఛ తీర్చుకున్నారు. మహేందర్ కోసం అతని ఇంటికి వచ్చిన బాలికపై కన్నేసిన అతని తండ్రి 60 ఏళ్ల చిర్రకుంట లచ్చులు కూడా తన పైత్యానికి ఆమెను బలి చేశాడు. తండ్రీకొడుకులతోపాటు ఆ ముగ్గురు కామాంధులు ఆమెపై నెలలుగా ఈ దాష్టీకం చేస్తూ వచ్చారు. ఫలితంగా రెండు నెలల క్రితం బాలిక కడుపు నొప్పి అని చెప్పడంతో కుటుంబ సభ్యులు మంచిర్యాల ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి చూపించారు. అక్కడి వైద్యులు బాలిక 7వ నెల గర్భవతి అని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఘొల్లుమన్నారు. బాలికను నిలదీయడంతో పూసగుచ్చినట్టు విషయం వివరించింది. వెంటనే వారు పంచాయతీ పెద్దలను ఆశ్రయించారు. ఈనెల 3న పంచాయతీ నిర్వహించిన గ్రామ కుల పెద్దలు ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన వారిలో నలుగురికి తలా 50 వేల రూపాయల జరిమానా విధించి, ఒకరిని వివాహం చేసుకోవాలని తీర్పు చెప్పారు. వివాహం చేసుకునే వ్యక్తి జరిమానా కట్టక్కర్లేదని చెప్పారు. అయితే, పెళ్లికి నిరాకరించడంతో అతనికి కూడా 50 వేల రూపాయల జరిమానా విధించారు. ఈ విషయం ఆనోటా ఈనోటా పాకి పోలీసులకు చేరడంతో అప్రమత్తమైన పోలీసులు, ఘటన పూర్వాపరాలు పరిశీలించి. ఫిర్యాదు స్వీకరించి, కేసు నమోదు చేశారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ ప్రారంభించినట్టు తెలుస్తుండగా, అరెస్టులను పోలీసులు నిర్ధారించకపోవడం విశేషం.