: గోవా మాజీ విద్యాశాఖ మంత్రిపై అత్యాచారం, మనుషుల అక్రమ రవాణా, విషప్రయోగం, అక్రమ నిర్భంధం కేసులు నమోదు
గోవా మాజీ విద్యాశాఖ మంత్రి, కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్యే బాబూష్ మొన్సరేట్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 16 ఏళ్ల బాలిక అత్యాచారం కేసులో ఆమె వాంగ్మూలం తీసుకున్న పోలీసులు, గోవా మెడికల్ కాలేజీలో నిర్వహించిన పరీక్షల్లో బాలికపై అత్యాచారం జరిగినట్టు నిర్ధారించారు. దీంతో ఎమ్మెల్యే బాబూష్ మొన్సరేట్ ను అరెస్ట్ చేశారు. ఆయనపై అత్యాచారం, మనుషుల అక్రమ రవాణా, విషప్రయోగం, అక్రమ నిర్బంధం కేసులు పెట్టారు. అతనితోపాటు ఎమ్మెల్యేకు బాలికను 50 లక్షల రూపాయలకు అమ్మేసిన ఆమె సవతి తల్లిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై మనుషుల అక్రమ రవాణా, నిర్బంధం తదితర కేసులు నమోదు చేశారు. కాగా, అరెస్టు సమయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తానేమీ పారిపోవడం లేదని, తానే స్వచ్ఛందంగా లొంగిపోయానని చెప్పారు. తానే తప్పు చేయలేదని, రాజకీయ కక్ష సాధింపులో భాగంగా తనను అరెస్టు చేశారని తెలిపారు. ఆమె తన హాల్ మార్క్ షోరూంలో పని చేసేదని, దొంగతనం చేస్తూ పట్టుబడడంతో ఆమెను విధుల్లోంచి తొలగించానని, దీంతోనే ఆమె తనపై లేనిపోని ఆరోపణలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు.