: అన్నీ హామీలే...జీవోలేవి?: ఏపీ సచివాలయ ఉద్యోగుల జేఏసీ నేత మురళీకృష్ణ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై సచివాలయ ఉద్యోగుల జేఏసీ నేత మురళీకృష్ణ మండిపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, మరో పది రోజుల్లో సచివాలయ ఉద్యోగులు ఏపీకి తరలి రావాలని చెబుతున్న ఏపీ ప్రభుత్వం అందుకు తగ్గ ఏర్పాట్లు చేయలేదని తెలిపారు. 'ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు ఐదు రోజుల పనిదినాలే ఉండేలా చూస్తామని చెప్పింది. ఉద్యోగుల పిల్లలు ఏ కళాశాలలో కోరితే ఆ కళాశాల్లో సీటు వచ్చేలా చూస్తామంది. ఇంకా మరెన్నో తాయిలాలు ఇస్తామంటూ ఘనంగా ప్రకటన చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుకు సంబంధించి ఇప్పటి వరకు కనీసం ఒక్క జీవో కూడా ఇవ్వలేదు' అని ఆయన ఆరోపించారు. ఇలాగయితే ఉద్యోగులు ప్రభుత్వాన్ని ఎలా నమ్ముతారని ఆయన నిలదీశారు. సమయం తక్కువ ఉందని, ఇంకా మీనమేషాలు లెక్కిస్తూ కూర్చుంటే ఏపీ సచివాలయ ఉద్యోగులు పునరాలోచించాల్సిన అవసరం ఉందని ఆయన హెచ్చరించారు.