: అతని సంగీతానికి పిల్లులే శ్రోతలు!
పాషాణ హృదయాలను సైతం కరిగించే శక్తి సంగీతానికి ఉందని చెబుతారు. అందుకే సినీ నేపథ్య గాయకుల నుంచి, ట్రైన్ లో భిక్షాటన చేసే వారి వరకు అంతా సంగీతాన్ని నమ్ముకునే వారే. మనకు ట్రైన్లలో పాటలు పాడుతూ కనిపించే వారి మాదిరిగా విదేశాల్లో రద్దీ కూడళ్లలో కూడా కనిపిస్తుంటారు. వారి మ్యూజిక్ తో ఆ దారిలో వెళ్లేవారిని ఆకట్టుకుని తృణమో, ఫణమో పుచ్చుకుంటుంటారు. అలాగే కౌలాలంపూర్ లో ఓ రోడ్డులో ఓ వ్యక్తి గిటార్ పట్టుకుని తన సంగీత సామర్థ్యం ప్రదర్శిస్తున్నాడు. అయితే, ఆయన మ్యూజిక్ విని మనుషులైతే ఆయన చుట్టూ గుమికూడలేదు కానీ, ఒక పిల్లి వచ్చి కుదురుగా కూర్చుని మ్యూజిక్ వినడం ప్రారంభించింది. కాసేపట్లో మరో మూడు పిల్లులు వచ్చి అతని మ్యూజిక్ కు శ్రోతలుగా మారాయి. అతను మ్యూజిక్ వినిపిస్తున్నంతసేపూ అవి అలాగే కూర్చుని విన్నాయి. మధ్యలో అతని మ్యూజిక్ కు తగ్గట్టు తలలు కూడా ఆడించాయి. దీంతో ఆయన కేవలం వాటి కోసమే గిటార్ వాయించి ధన్యవాదాలు తెలిపాడు. ఈ తతంగమంతా అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి సెల్ ఫోన్ లో షూట్ చేసి, సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో ఇది అందర్నీ ఆకట్టుకుంటోంది.