: ఛత్రపతి శివాజీ విగ్రహంపై చెయ్యి వేసి ఫోటో దిగిన బీజేపీ మహిళా కార్పోరేటర్ .. సోషల్ మీడియాలో విమర్శలు... ఆపై క్షమాపణలు
ఛత్రపతి శివాజీ విగ్రహం భుజంపై చెయ్యివేసి బీజేపీ కార్పోరేటర్‌గా ఉన్న ఓ మహిళ ఫోటో దిగింది. అనంతరం ఆ ఫోటోని ఎవరో సోషల్ మీడియాలోకి ఎక్కించేశారు. దీంతో ఆమెకు నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. వివరాలు చూస్తే.. మహారాష్ట్రలోని బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ బీజేపీ కార్పోరేటర్ రాజేశ్రీ శిర్వాద్కర్ కొద్ది రోజుల క్రితం ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహంపై చేయి వేసి స్టైలుగా ఫోటోకి పోజిచ్చారు. ఆపై ఎవరో ఈ ఫోటోని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసేశారు. ధీరత్వానికి ప్రతీకగా కొలిచే శివాజీపై చేయివేస్తావా..? అంటూ ఆ పోస్ట్ పై నెటిజన్లు కామెంట్లు చేస్తూ.. ఆ ఫోటోను షేర్లపై షేర్లు చేశారు. ఈ ఫోటో ప్రతిపక్షమైన కాంగ్రెస్ నేతల కంట పడింది. దీంతో రాజేశ్రీ శిర్వాద్కర్ పై చర్యలు తీసుకోవాలంటూ ర్యాలీ కూడా తీశారు. ఆఖరికి తాను పొరపాటు చేశానని, శివాజీపై తనకు ఎంతో గౌరవం ఉందని ఆమె పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.