: 5 పైసల అవినీతి ఆరోపణపై 40 ఏళ్లుగా పోరాటం చేస్తున్న ఉద్యోగి!
ప్రస్తుత టీనేజర్లు 5 పైసలు ఎలా ఉంటుందో కూడా చూసి ఉండరు. అలాంటి 5 పైసల కోసం ఓ వ్యక్తి గత 40 ఏళ్లుగా పోరాడుతున్నాడంటే ఆశ్చర్యం కలగక మానదు. వివరాల్లోకి వెళ్తే...ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (డీటీసీ) లో రణవీర్ సింగ్ యాదవ్ (73) పని చేసేవాడు. 1973లో ఆయన కండక్టర్ గా విధులు నిర్వర్తిస్తుండగా, చెకింగ్ స్టాఫ్ బస్సులో తనిఖీలు నిర్వహించింది. ఈ లెక్కల్లో ఓ మహిళా ప్రయాణికురాలి నుంచి 10 పైసలకి బదులుగా 15 పైసలు వసూలు చేశాడని, ఆమె నుంచి అదనంగా తీసుకున్న 5 పైసలు జేబులో వేసుకోవాలని ప్రయత్నించాడని అతనిపై ఇంటర్నల్ విచారణ నిర్వహించారు. తాను చేయని తప్పుకు నింద మోయాల్సి వచ్చిందన్న అవమానభారంతో కోర్టుకు వెళ్లాడు. 1976 నుంచి ఆయన న్యాయపోరాటం చేసి, 1990లో కార్మికుల న్యాయస్థానంలో ఆయన ఈ కేసులో విజయం సాధించారు. అయితే, 1991లో ట్రాన్స్ పోర్టు డిపార్ట్ మెంట్ మళ్లీ అతనిపై కేసును తిరగదోడి హైకోర్టుకు వెళ్లింది. దీంతో అప్పటి నుంచి ఆయన ఈ కేసులో విచారణకు హాజరవుతున్నారు. ఈ ఏడాది జనవరిలో హైకోర్టు యాదవ్ కు అనుకూలంగా తీర్పు చెబుతూ, అతనికి నష్టపరిహారంగా 30 వేల రూపాయలను చెల్లించాలని ఆదేశించింది. అంతేకాకుండా, 1.28 లక్షల పారితోషికం, 1.37 లక్షల సీపీఎఫ్ తదితరాలను తక్షణం అతనికి చెల్లించాలని డీటీసీని ఆదేశించింది. ఈ నెల 26న కార్కార్డోమా కోర్టులో తుదితీర్పుకు యాదవ్ హాజరుకానున్నారు.