: ప్రత్యేకహోదా రాకపోతే చంద్రబాబు చరిత్రహీనులుగా మిగిలిపోతారు: అంబటి రాంబాబు
ఏపీకి ప్రత్యేక హోదా సాధించలేకపోతే కనుక ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని గతంలో ప్రకటించారని, ఇచ్చిన హామీని కూడా సాధించుకోలేకపోతే ఎలా? అని ఆయన ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినప్పటికీ కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ ఎలా కొనసాగుతోందన్నారు. టీడీపీ స్వప్రయోజనాల కోసమే ఆ విధంగా చేస్తోందని ఆరోపించారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు రెండు రకాలుగా మాట్లాడుతున్నారని, ప్రత్యేక హోదా ఏమైనా సంజీవని వంటిదా? అని ఆయన గతంలో అన్నారని, అది లేకపోతే కష్టమని ఇప్పుడంటున్నారని అన్నారు. ఒకవేళ చరిత్రలో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేశారనే పేరు చంద్రబాబు తెచ్చుకోవచ్చేమో గానీ, ఏపీకీ ప్రత్యేక హోదా తేకపోతే ప్రజలు ఆయనను క్షమించరని అంబటి రాంబాబు అన్నారు.