: బెబ్బులిని లేపి గొడవపెట్టుకోవద్దు: ఆంధ్రానేతలకు కేసీఆర్ హెచ్చరిక
పడుకున్న బెబ్బులిని లేపి గొడవ పెట్టుకోవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రా నేతలను హెచ్చరించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, మీ చిల్లర రాజకీయాలు తన దగ్గర పని చేయవని స్పష్టం చేశారు. ఏపీకి చెందిన ఇద్దరు నేతల సంగతి తనకు తెలుసని ఆయన అన్నారు. తన దగ్గర నాటకాలాడవద్దని ఆయన హితవు పలికారు. తెలంగాణలో ఉన్న అంతో ఇంతో మర్యాదని పోగొట్టుకోవద్దని ఏపీ నేతలకు ఆయన సూచించారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలతో ఆటలాడుకోవాలని చూస్తే...తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. 'గోదావరి నీళ్లు ఎలా ఉపయోగించుకోవాలో తెలియని మీరు తెలంగాణ మీద పడి ఏడవడం ఎందుకు?' అంటూ ఆయన ప్రశ్నించారు. 'మీకు చేత కాకుంటే చెప్పండి, గోదావరి నీరు ఎలా వినియోగించుకోవాలో వివరిస్తా'నని ఆయన బంపర్ ఆఫర్ ఇచ్చారు. రాజకీయ అవసరాల కోసం ప్రజల మధ్య చిచ్చుపెట్టొద్దని ఆయన హెచ్చరించారు.