: రాష్ట్రం విడిపోయినప్పటికీ ఏపీ నేతలు కష్టాలు పెడుతున్నారు, మా నీళ్లు మేం తీసుకుంటే చంద్రబాబుకి బాధెందుకు?: హరీశ్‌రావు
తెలంగాణ ప్రభుత్వం అనుమతులు లేకుండా సాగునీటి ప్రాజెక్టులు చేపడుతోందంటూ ఏపీ నేతలు విమర్శలు గుప్పిస్తోన్న నేపథ్యంలో హరీశ్ రావు ఈరోజు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా దేవరప్పులో మిషన్ కాకతీయ పనులు ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్రం విడిపోయినా కూడా ఆంధ్రనేతలు తెలంగాణ ప్రజలను కష్టాలు పెడుతున్నారని ఆరోపించారు. ‘మా నీళ్లు మేం తీసుకుంటే చంద్రబాబుకు బాధెందుకు..?’ అని హరీశ్ రావు ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్టుపై కోర్టులో కేసు వేసేందుకు ఏపీ మంత్రులు సిద్ధపడుతుంటే, తెలంగాణలోని టీడీపీ నాయకులు దీనిపై ఎందుకు ప్రశ్నించడంలేదని దుయ్యబట్టారు. చంద్రబాబు ఆంధ్రబాబు కాబట్టి తెలంగాణ ప్రాజెక్టులని ఆపుతాడని, కానీ, ఈ గడ్డపై పుట్టిన పలువురు నేతలు కూడా ప్రాజెక్టులను ఆపడానికి ప్రయత్నిస్తున్నారని హరీశ్ రావు విమర్శించారు. కరవు కష్టాలు రాకుండా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టామని, వీలైనంత తొందరగా వాటిని పూర్తి చేయాలని చూస్తున్నట్లు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల కష్టాలను తీర్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని హరీశ్ రావు చెప్పారు.