: వరుసగా మూడో రోజు!... అగస్టా కుంభకోణంలో సీబీఐ విచారణకు త్యాగీ
అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణంలో భారత మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎస్పీ త్యాగీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. నాటి భారత ప్రభుత్వం, ఇటలీకి చెందిన అగస్టా వెస్ట్ ల్యాండ్ కంపెనీల మధ్య సంధానకర్తగా వ్యవహరించిన త్యాగీ పెద్ద ఎత్తున ముడుపులు అందుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయనకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేయగా, ఈడీ కంటే కాస్తంత వేగంగానే స్పందించిన సీబీఐ ఆయనను విచారణకు పిలిచింది. మొన్న (సోమవారం) ఢిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయానికి వెళ్లిన త్యాగీ సాయంత్రం దాకా అక్కడే ఉన్నారు. గంటల తరబడి సీబీఐ అధికారులు సంధించిన ప్రశ్నలకు త్యాగీ సమాధానాలు చెప్పారు. నిన్న కూడా త్యాగీని విచారించిన సీబీఐ అధికారులు నేడు కూడా విచారణకు రావాల్సిందేనని ఆయనకు సూచించారు. దీంతో కొద్దిసేపటి క్రితం త్యాగీ సీబీఐ కార్యాలయానికి వచ్చారు. ఆయన వచ్చీరాగానే ఆయనను లోపలికి తీసుకెళ్లిన సీబీఐ... ఈ కుంభకోణానికి సంబంధించిన మరిన్ని వివరాలు రాబట్టేందుకు విచారణ ప్రారంభించింది.