: కారు కోసం సొంత ఇంటికే కన్నమేసిన కొడుకు!
యువత విలాసాల బాటపడుతున్నారు. విలాసాల కోసం దేనికైనా తెగిస్తున్నారు. యువత తీరుతెన్నులను తెలిపే ఇలాంటి కేసును చెన్నై పోలీసులు ఛేదించారు. వివరాల్లోకి వెళ్తే...చెన్నైలోని రామాపురం ప్రాంతంలో నారాయణ్ లాల్ అనే చిన్న హార్డ్ వేర్ వ్యాపారి ఉన్నారు. ఆయనకు ఉత్తమ్ చంద్, మహేంద్రన్ అనే కుమారులతో పాటు ఓ కుమార్తె కూడా ఉంది. తాజాగా కుమార్తె, భార్యతో కలిసి నారాయణ్ లాల్ రాజస్థాన్ లోని స్వస్థలానికి వెళ్లారు. దీంతో ఈ ఆదివారం అతని ఇద్దరు కుమారులు, షాపులో పని చేసే నలుగురితో కలిసి కొలపాక్కంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. తిరిగి వచ్చి చూసేసరికి ఆ ఇల్లు చోరీకి గురైంది. 7.5 లక్షల రూపాయల విలువైన బంగారు, వెండి నగలు చోరీకి గురైనట్టు గుర్తించారు. దీంతో మహేంద్రన్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రంగప్రవేశం చేసిన పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. తాళాన్ని డ్రిల్లింగ్ చేసి లోపలికి ప్రవేశించినట్టు సీసీటీవీ కెమెరా చిత్రీకరించి ఉండడంతో అనుమానించిన పోలీసులు కేసును ఛేదించారు. లాల్ ఇంట్లోకి ప్రవేశించింది అతని చిన్న కుమారుడు మహేంద్రన్ స్నేహితులు జీవా, రాజేష్ అని తేల్చారు. మహేంద్రన్ ను తమదైన శైలిలో విచారించగా, కారు కొనుక్కునేందుకు స్నేహితులతో కలిసి దొంగతనం చేసినట్టు తెలిపాడు. దీంతో కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు.