: మా ఇంట్లోంచి చుట్టాలు తిరిగి వెళ్లట్లేదు.. వారిని పంపించేయండి!: పోలీసులకి ఫిర్యాదు చేసిన గుంటూరు జిల్లా వాసి
ఇంటికి చుట్టాలు వస్తే ఎవరైనా సరే ఆదరించి పంపుతారు. వాళ్లు వెంటనే తిరిగి వెళ్లకుండా తిష్ఠ వేసినా, కూడా బంధుత్వం ఎక్కడ పోతుందోనన్న ఉద్దేశంతో మాట్లాడకుండా మర్యాదలు చేస్తాం. అయితే, ఇక్కడ ఒకాయన మాత్రం బంధువులతో విసిగిపోయాడు. దాంతో 'మా ఇంటికి చుట్టాలొచ్చారు.. తిరిగి వెళ్లట్లేదు' అంటూ సరాసరి పోలీసులకి ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలోని తాడేపల్లి సమీపంలో చోటుచేసుకుంది. అక్కడి ఆర్ఎంఎస్ కాలనీలో నివాసం ఉండే విజయేందర్‌రావు అనే మాజీ సైనికోద్యోగి తన ఇంటికి వచ్చిన చుట్టాలు ఎంతకూ వెళ్లకపోవడంతో పోలీసులకి ఫిర్యాదు చేశాడు. తన మనవడు, మనవరాలు కుటుంబంతో పాటు తమ ఇంటికి వచ్చి తిరిగి వెళ్లట్లేదని.. వారిని తన ఇంటి నుంచి పంపించాలని పోలీసులకి తెలిపాడు. బంధువులను తిరిగి వారింటికి పంపించడం తన వల్ల కావడం లేదని, వారిపై కేసు నమోదు చేసి ఇంటినుంచి పంపించాలంటూ పోలీసులకి మొరపెట్టుకున్నాడు. తాను చేసిన పిర్యాదుకి పోలీసులు స్పందించకపోవడంతో రెండోసారి కూడా పోలీసుల దగ్గరికి వెళ్లి తమ బంధువులపై కేసు నమోదు చెయ్యాలని విజయేందర్‌రావు వేడుకున్నాడు. అయితే దీనిపై ఎలా స్పందించాలో తెలియక పోలీసులు తలపట్టుకుంటున్నారు.