: ఆరుగురు నేతలు... రెండు రోజుల చర్చలు... ఫలితమే భూమా, శిల్పాల మధ్య రాజీ!


కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ నేతలు భూమా నాగిరెడ్డి, శిల్పా మోహన్ రెడ్డిల మధ్య రాజీ కుదిర్చేందుకు ఆ పార్టీ భారీగానే కసరత్తు చేసింది. విజయవాడ కేంద్రంగా రెండు రోజుల పాటు జరిగిన చర్చలు ఎట్టకేలకు ఫలించాయి. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం చర్చలు ముగిసి మీడియా ముందుకు వచ్చిన శిల్పా మోహన్ రెడ్డి, ఆయన సోదరుడు, పార్టీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డిలు... భూమాతో సయోధ్య కుదిరిందని ప్రకటించారు. భూమా, శిల్పాల మధ్య సయోధ్యను కుదిర్చేందుకు పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు సహా పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు శ్రమించాల్సి వచ్చింది. నిన్న చంద్రబాబు ఆదేశాలతో ఇరు వర్గాలతో చర్చలకు పార్టీ ఏపీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు, కర్నూలు జిల్లా ఇన్ చార్జీ మంత్రి హోదాలో కింజరాపు అచ్చెన్నాయుడు రంగంలోకి దిగారు. గంటల తరబడి జరిపిన చర్చల్లో ఇరువర్గాలను కళా, అచ్చెన్నలు ఓ దరికి చేర్చగలిగారు. ఆ తర్వాత చర్చల పురోగతిని చంద్రబాబుకు వివరించారు. ఇక నేడు కూడా అందుబాటులోనే ఉండాలన్న నిన్నటి చంద్రబాబు ఆదేశాల్లో ఇరువర్గాలు రాత్రి విజయవాడలోనే బస చేశాయి. తాజాగా నేటి ఉదయం జరిగిన చర్చలకు చంద్రబాబు... కర్నూలు జిల్లాలో కీలక నేతగా ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తిని పిలిపించారు. మరోవైపు కృష్ణా జిల్లాకు చెందిన కీలక నేత, ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ కూడా ఈ చర్చల్లో కీలక భూమిక పోషించారు. ఇక భూమా, శిల్పాలు తమ సొంతూరు నంద్యాల నుంచి విజయవాడ వచ్చే సమయంలోనే వారి వెంట పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ కలిసి వచ్చారు. నంద్యాలకే చెందిన ఫరూక్... భూమా, శిల్పా బ్రదర్స్ కు చెందిన కీలక విషయాలను ఎప్పటికప్పుడు పార్టీకి అందించి చర్చలు విజయవంతమయ్యే విషయంలో కీలకంగా వ్యవహరించారు.

  • Loading...

More Telugu News